LOADING...
online money games: ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ నిషేధానికి కేంద్రం సిద్ధం.. వ్యసనం,ఆత్మహత్యలే కారణం
ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ నిషేధానికి కేంద్రం సిద్ధం.. వ్యసనం,ఆత్మహత్యలే కారణం

online money games: ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ నిషేధానికి కేంద్రం సిద్ధం.. వ్యసనం,ఆత్మహత్యలే కారణం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌కు వ్యసనపరులుగా మారి ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ వ్యసనం, కారణంగా చేసుకుంటున్న ఆత్మహత్యలు, మానసిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పార్లమెంట్‌లో "ప్రొమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్‌-2025"ను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులో భాగంగా డబ్బు పెట్టి మరింత ఎక్కువ మొత్తాన్ని గెలుచుకునేలా చేసే ఆన్‌లైన్‌ గేమ్స్‌ను పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదించింది. సమాచార సాంకేతిక శాఖ (MeitY) విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.."డబ్బు గెలిచే ఆశతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే అలవాటు,ముఖ్యంగా పిల్లలు,యువతలో తీవ్ర వ్యసనంగా మారుతోంది.దీని వల్ల మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయి" అని పేర్కొంది.

వివరాలు 

ఉల్లంఘన చేసినవారికి కఠినమైన శిక్షలు

దీర్ఘకాలంగా ఆడే అలవాటు వల్ల ఉద్విగ్నత, నిరాశ, నిద్రలేమి, ప్రవర్తన సమస్యలు పెరుగుతున్నాయని వైద్య పరీక్షలు, ఫీల్డ్‌ అధ్యయనాలు నిర్ధారించాయని తెలిపింది. ఈ గేమ్స్‌ను అందిస్తున్న వారిని లేదా ప్రోత్సహిస్తున్న వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా రూ.1 కోటి జరిమానా లేదా రెండూ విధించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. మరల ఉల్లంఘన చేసినవారికి కఠినమైన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ ప్రచారం లేదా ప్రకటనలు ఇవ్వడం కూడా నేరంగా పరిగణించి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ మీద పూర్తి స్థాయి నియంత్రణకు కేంద్రం అడుగులు

ప్రస్తుతం ఆన్‌లైన్‌ గేమ్స్‌ పరిధి విస్తృతంగా ఉంది.మొబైల్‌ గేమ్స్‌,ఎడ్యుకేషనల్‌ యాప్‌లు,ఫ్యాంటసీ స్పోర్ట్స్‌,పోకర్‌ వంటి రియల్‌ మనీ గేమ్స్‌ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే డ్రీమ్‌11,మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (MPL) లాంటి ఫ్యాంటసీ క్రికెట్‌ యాప్‌లకు ప్రముఖ క్రికెటర్ల మద్దతు,భారీ స్థాయిలో మార్కెటింగ్‌ కారణంగా విపరీతమైన ఆదరణ,పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర స్థాయిలో ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణకు ప్రత్యేక చట్టం లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు తమ సొంత నిబంధనలు పెట్టాయి.తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ను నిషేధించగా, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలు మాత్రం ఆపరేటర్లు ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి చేశారు. మొత్తానికి, ఈ బిల్లుతో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ మీద పూర్తి స్థాయి నియంత్రణకు కేంద్రం అడుగులు వేస్తోంది.