
UK-India: నేడు యునైటెడ్ కింగ్‌డమ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసుకోనున్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రోజు రెండు దేశాల పర్యటనలో భాగంగా లండన్‌కు చేరుకున్నారు. గురువారం బ్రిటన్‌తో భారత్ మధ్య కీలకమైన ఒప్పందం కుదరనుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. వాణిజ్యం,ఆరోగ్యరంగం,ఇంధనవనరులు, విద్య, భద్రత వంటి అనేక అంశాలపై యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో మోదీ ముఖాముఖీ చర్చలు జరిపే అవకాశముంది. ఆ సమావేశం అనంతరం ఒప్పందానికి అధికారికంగా సంతకాలు జరుగుతాయి. ఈ పర్యటనకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కూడా హాజరయ్యారు.
వివరాలు
2030 నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపే లక్ష్యం
మూడు సంవత్సరాలపాటు సాగిన చర్చలకు ముగింపు పలుకుతూ, మే 6వ తేదీన ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు పూర్తయినట్లు ప్రకటించాయి. 2030 నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం రూపొందించబడింది. ఇందులో భాగంగా బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను తక్కువ ధరలో అనుమతిస్తూ... భారతదేశం నుండి ఎగుమతి చేసే తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి వస్తువులపై ఉన్న దిగుమతి పన్నులను రద్దు చేయాలని నిర్ణయించబడింది.
వివరాలు
ప్రధాని మోదీ మాల్దీవులకు..
ఈఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు గురువారం సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే భారత మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఇది పూర్తిగా అమలులోకి రావాలంటే బ్రిటన్ పార్లమెంటు నుండి కూడా ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలపనున్నారు. అనంతరం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానంతో ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లనున్నారు. అక్కడ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. మొహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం.