Page Loader
మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన 
అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన

మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 09, 2023
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్‌ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఇండియన్ ఆర్మీలోని స్పియర్‌ కార్ప్స్ విభాగం స్పందించింది. కేంద్ర బలగాలు (అస్సాం రైఫిల్స్‌) ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకమైన చర్యలు జరుగుతున్నట్లు స్పియర్‌ కార్ప్స్ అభిప్రాయపడింది. ఈశాన్య రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకాండను కట్టడి చేసేందుకు సమర్థంగా పనిచేస్తున్నామని స్పియర్ కార్ప్స్ పేర్కొంది. మే 3 నుంచి రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లకు వ్యతిరేకంగా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అస్సాం రైఫిల్స్‌ శ్రమిస్తోందని తెలిపింది. అయితే రైఫిల్స్ సమగ్రతను ప్రశ్నార్థకం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పింది. శాంతిని నెలకొల్పేటప్పుడు విధి నిర్వహణలో ఉన్న బలగాల మధ్య విభేదాలు వస్తుంటాయని, వాటిని ఐక్య కార్యాచరణ ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

DETAILS

అస్సాం రైఫిల్స్‌ కి బదులుగా మణిపూర్ పోలీసులు, CRPF బలగాలు

మరోవైపు బఫర్‌ జోన్‌ మార్గదర్శకాలను కచ్చితత్వంతో అమలు చేయాలని ఆదేశాలున్నాయని, అందుకు అనుగుణంగానే అస్సాం రైఫిల్స్‌ వ్యవహరించినట్లు వెల్లడించింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు సైన్యం, అస్సాం రైఫిల్స్‌ నిరాటంకంగా కృషి చేస్తాయని స్పియర్‌ కార్ప్స్‌ వివరించింది. అల్లర్ల ప్రాంతం నుంచి అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరిస్తున్నట్లు మణిపూర్ సర్కారు ప్రకటించగానే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. మరోవైపు దుండగులను వెంబడించకుండా అస్సాం రైఫిల్స్‌ తమను అడ్డుకుందని ఆ రాష్ట్ర పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక వర్గానికి అనుకూలంగా అస్సాం రైఫిల్స్‌ వ్యవహరిస్తోందని మైతీ మహిళలు సోమవారం ఆందోళన చేశారు. దీంతో అస్సాం రైఫిల్స్‌ కి బదులుగా మణిపూర్ పోలీసులు, CRPF బలగాలను కల్లోలిత ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మోహరించింది.