No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే మణిపూర్‌ని రెండు భాగాలుగా విభజించారని మండిపడ్డారు. ఇక మణిపూర్ ఉనికిలో లేదు అని రాహుల్ గాంధీ చెప్పారు. మణిపూర్‌లో పర్యటించనందుకు ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
లోక్‌సభలో రాహుల్ ప్రసంగం
ప్రధాని మోదీ దేశద్రోహి: రాహుల్
రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత చేసిన తొలి ప్రసంగంలో రాహుల్ గాందీ మోదీని టార్గెట్ చేశారు. జాతి ఘర్షణలతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తాను సందర్శించానని, ప్రధాని మోదీ ఎందుకు మణిపూర్‌కు వెళ్లలేదని ప్రశ్నించారు. భారతదేశంలో మణిపూర్ భాగం కాదని మోదీ అనుకుంటున్నారని విమర్శించారు. మణిపూర్‌లో భారతమాత హత్యకు కారణమైన ప్రధాని మోదీ దేశద్రోహి అన్నారు. ఆయన జాతీయవాది కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా పలువురు బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీ సహా కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.
అదానీ గురించి మాట్లాడను భయపడకండి: రాహుల్
రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ఆసక్తికరంగా ప్రారంభించారు. చివరిసారి తాను సభలో గౌతమ్ అదానీ గురించి మాట్లాడి బీజేపీ సీనియర్ నేతలను ఇబ్బంది పెట్టానని చమత్కరించారు. అందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. అయితే అప్పుడు మాత్రం తాను నిజమే చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు భయపడోద్దని, అదానీ గురించి తాను మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. భారత సైన్యం ఒక్కరోజులో మణిపూర్‌లో శాంతిని నెలకొల్పగలదని రాహుల్ గాంధీ నొక్కిచెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్మీ సేవలను ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు.
మోదీని రావణుడితో పోల్చిన రాహుల్ గాంధీ
మోదీని రాహుల్ గాంధీ రావణుడితో పోల్చారు. అలాగే ప్రజా సమస్యలను మోదీ పట్టించుకోవడం లేదని, ఆయన్ను అహంకారి అని అభివర్ణించారు. హనుమంతుడి వల్ల లంక దగ్ధం కాలేదని, రావణుడి అహంకారం వల్ల కాలిపోయిందని మోదీ అన్నారు. రావణుడు మేఘనాథ్, కుంభకర్ణ మాటలను వినడం వల్లే ఆ అనర్థం జరిగిందన్నారు. ఇప్పుడు మోదీ కూడా రావణుడి వలే అమిత్ షా, గౌతమ్ అదానీ మాటలను వింటున్నారన్నారు. 'మీరు దేశం మొత్తాన్ని తగలబెట్టాలని చూస్తున్నారు' అని మండిపడ్డారు. ముందుగా మణిపూర్‌ని తగలబెట్టారని, ఇప్పుడు ఇప్పుడు హర్యానాలో కూడా అదే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.