LOADING...
Russian Oil: దేశ ప్రయోజనాల కోసం రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: భారత రాయబారి వినయ్‌ కుమార్‌
దేశ ప్రయోజనాల కోసం రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: భారత రాయబారి వినయ్‌ కుమార్‌

Russian Oil: దేశ ప్రయోజనాల కోసం రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: భారత రాయబారి వినయ్‌ కుమార్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు సుంకాలు (టారిఫ్‌లు) విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్యపై పాశ్చాత్య దేశాల విమర్శలను న్యూదిల్లీ నిరంతరం ఖండిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రష్యాలో భారత రాయబారి వినయ్‌ కుమార్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ ఉత్తమమైన ఒప్పందం లభిస్తే, అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

140 కోట్ల ప్రజలకు ఇంధన భద్రతను కల్పించడం న్యూదిల్లీకి అత్యంత ప్రాధాన్యం

రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్‌ (TASS) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''మా దేశంలోని 140 కోట్ల ప్రజలకు ఇంధన భద్రతను కల్పించడం న్యూదిల్లీకి అత్యంత ప్రాధాన్యం. తక్కువ ధరలో ఉత్తమమైన ఒప్పందం లభించే చోట నుంచే భారతీయ కంపెనీలు (Indian Oil Companies) చమురు కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. రష్యాతో సహకారం కొనసాగుతుండటమే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండటానికి కారణం'' అని వినయ్‌ కుమార్‌ వివరించారు. ఇక భారత్‌పై అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లను ఆయన తీవ్రంగా విమర్శించారు. వాషింగ్టన్‌ నిర్ణయం 'అహేతుకం, అన్యాయం, పాక్షిక ధోరణి' అని అభివర్ణించారు.

వివరాలు 

భారత ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు: ఎస్‌. జైశంకర్‌

దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. ''అమెరికా,ఐరోపా దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నాయి. భారత్‌-మాస్కో పరస్పర సహకారంపై ఆధారపడి వాణిజ్య సంబంధాలు ముందుకు సాగుతున్నాయి.భారత ప్రజల ప్రయోజనాలను కాపాడటమే మా అంతిమ లక్ష్యం''అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌తో ఎవరికైనా భేదాభిప్రాయం ఉంటే, భారత ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. అంతేకాక, ట్రంప్‌ అదనపు టారిఫ్‌లు ప్రకటించే ముందు రష్యా చమురు అంశంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కూడా వెల్లడించారు.