చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ
చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో చంద్రయాన్-3 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలతో సహా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. భారతదేశానికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రాట్యూలేషన్స్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఇది 140 కోట్ల భారతీయులందరి సమష్టి విజయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ఇస్రో విజయం ప్రధాని పాలనా దక్షతకు నిదర్శమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ఇస్రోకు సీజేఐ డీవై చంద్రచూడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాస్త్రీయ పరిశోధన, నూతన ఆవిష్కరణలో కొత్త మార్గాలకు తాజా విజయం సహాయపడుతుందన్నారు.
ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఇస్రో : రాహుల్
మరోవైపు పలు రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. భారత్ విజయం పట్ల వైఎస్ జగన్, భూపేందర్ పటేల్, హిమంత బిస్వశర్మ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, యోగి ఆధిత్యనాథ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇస్రో సైంటిస్ట్ బృందానికి అభినందనలు తెలియజేశారు. నిర్దేశించిన చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అనేది శాస్త్రవేత్తల దశాబ్దాల కృషి ఫలితమేనన్నారు.ఇస్రో స్థాపించిన 1962 నుంచి కొత్త తరాలకు స్ఫూర్తినిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటోందన్నారు. ఈషా ఫౌండేషన్ తరఫున ఇస్రో సైంటిస్టులకు కాంగ్రాట్యూలేషన్స్ తెలిపారు.ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ ఛైర్‌పర్సన్ గౌతమ్ అదానీ భారత అంతరిక్ష కేంద్రం సైంటిస్టుల కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు అందించారు.