
Uttam Kumar Reddy: జగన్‌తో స్నేహం కొనసాగిస్తూ తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలే సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణకు 500 టీఎంసీలు కావాలని వాదన ప్రారంభించామని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లాకు అభివృద్ధి దక్కేదన్నారు.
Details
బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు అన్యాయం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించిన ఉత్తమ్, జగన్‌తో స్నేహం కొనసాగిస్తూ ఏపీ జలదోపిడీకి భారాస సహకరించిందని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా, అక్రమంగా ముచ్చుమర్రి నిర్మించినా అప్పటి సీఎం కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు.
కాళేశ్వరం అప్పు ప్రజలకు భారంగా మారింది
కాళేశ్వరం ప్రాజెక్టుతో నీరు అందలేదని, కానీ బీఆర్ఎస్ నేతల జేబులు నిండాయని ఉత్తమ్ ఆరోపించారు.
రూ.1,30,000 కోట్ల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలు ఎన్నటికీ తీర్చలేనంత అప్పు మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు.
Details
కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం
కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం బేసిన్ అవతలకు తరలిస్తున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఉత్తమ్ ఆరోపించారు.
299 టీఎంసీల హక్కు ఉన్నా, 190 టీఎంసీలకంటే ఎక్కువగా తెలంగాణ ఎప్పుడూ ఉపయోగించుకోలేదన్నారు.
కృష్ణా బేసిన్‌లో కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే మన వాటా పూర్తిగా వినియోగించుకునేవాళ్లమని పేర్కొన్నారు.
ఏదుల, దిండి ప్రాజెక్టులను కూడా పదేళ్లలో పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు.