LOADING...
Supreme Court: 'చైనా ఆక్రమణ నిజమేనా?.. రాహుల్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు
'చైనా ఆక్రమణ నిజమేనా?.. రాహుల్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు

Supreme Court: 'చైనా ఆక్రమణ నిజమేనా?.. రాహుల్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై భారత సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన చైనా 2,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుందనే వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నిజమైన భారతీయులు అలా మాట్లాడరని స్పష్టం చేసింది. చైనా భూఆక్రమణపై ఇలాంటి ఆరోపణలు ఏ ఆధారంతో చేశారని రాహుల్‌ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ తరఫున వాదించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. దేశంలో సమస్యలపై ప్రశ్నించకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లు, ఒక రాజకీయ నాయకుడు సమస్యలపై స్పందించాలనుకుంటే పార్లమెంట్ వేదికను వినియోగించాలి, సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు.

Details

సున్నితమైన విషయాలను సోషల్ మీడియాలో చెప్పడం సరికాదు

ఇటువంటి సున్నితమైన అంశాలను ఆవేశంగా సోషల్ మీడియాలో చెప్పడం సరికాదని సూచించారు. ఈ వివాదం 2022లో ప్రారంభమైంది. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ చేసిన ఓ ప్రసంగంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ సమయంలో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. ఇది ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువ. అయినా కేంద్ర ప్రభుత్వం ఆ విషయం గురించి నోరు మెదపడం లేదు. ప్రధాని మోదీ ఆక్రమణ జరగలేదంటూ అబద్ధాలు చెబుతున్నారు. దేశ మీడియా కూడా ఈ అంశంపై ప్రశ్నించకపోవడం బాధాకరమని ఆయన విమర్శించారు.

Details

భారత సైనికుల మృతిని ప్రస్తావించిన రాహుల్

అంతేకాదు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా రాహుల్ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసాయి. దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారన్న అభియోగంతో ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి రాహుల్‌పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు రాహుల్‌ గాంధీకి రాజకీయంగా భారీ ఎదురుదెబ్బగా మారాయి. ఇకపై అలాంటి ఆరోపణలకు ముందు పూర్తి ఆధారాలు ఉండాలంటూ న్యాయస్థానం సూచించింది.