
Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌తో కలిసి సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసింది ఎవరు? సిద్ధరామయ్య ఎలాంటి చరిత్రను సృష్టించబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక 9వ ముఖ్యమంత్రిగా పని చేసిన డి.దేవరాజ్ ఉర్స్ ఎక్కువ కాలం సీఎం పదవీలో కొనసాగారు. ఈయన రెండు పర్యాయాల్లో 2,790 రోజులు సీఎంగా పని చేశారు.
ఇప్పటి వరకు ఈయనదే రికార్డు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ నిజలింగప్ప రెండు దఫాల్లో 2,729 రోజులు పనిచేశారు. అతను కర్ణాటకకు నాల్గవ, ఏడో సీఎంగా పని చేశారు.
కర్ణాటక
కర్ణాటక చరిత్రలో సుధీర్ఘ కాలం సీఎంగా పని చేసిన ఏకైక నేతగా సిద్ధరామయ్య
అయితే గత 40ఏళ్లలో 5ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తొలి సీఎం సిద్ధరామయ్య కావడం గమనార్హం.
కర్ణాటక చరిత్రలోనే ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన రెండో సీఎంగా సిద్ధరామయ్య నిలిచారు. డి.దేవరాజ్ ఉర్స్(5వ ముఖ్యమంత్రి) తొలిసారిగా 5ఏళ్ల 286 రోజులపాటు సీఎంగా పనిచేశారు.
ఆ తర్వాత సిద్దరామయ్య మాత్రమే ఐదేళ్ల(5 సంవత్సరాల 4రోజులు) పదవీకాలాన్ని పూర్తి చేశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న సిద్ధరామయ్య, ఇప్పుడు కూడా 5ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తే కర్ణాటక చరిత్రలో సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టిస్తారు.
తద్వారా 3వేల కంటే ఎక్కువ రోజులు పని చేసిన ఏకైక సీఎంగా సిద్ధరామయ్య నిలుస్తారు. మే 2013లో తొలిసారి సిద్ధరామయ్య కర్ణాటక 28వ ముఖ్యమంత్రి అయ్యారు.
కర్ణాటక
కర్ణాటకలో ఏడాది కంటే తక్కువ కాలం సేవలందించిన 9మంది ముఖ్యమంత్రులు
రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితాలో రామకృష్ణ హెగ్డే మూడో స్థానంలో నిలిచారు. అతను 1,967 రోజుల పాటు సీఎంగా పని చేశారు.
కర్ణాటకలో ఏడాది కంటే తక్కువ కాలం సేవలందించిన ముఖ్యమంత్రులు తొమ్మిది మంది ఉన్నారు. వారిలో కడిదల్ మంజప్ప అతి తక్కువ రోజులు సేవలందించారు.
కేవలం 73 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్ణాటక ముఖ్యమంత్రులలో సగానికి పైగా రెండేళ్లలోపు పనిచేసినవారే కావడం గమనార్హం.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటికి వరకు జాబితాలో తొమ్మిది మంది లింగాయత్ వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రులు కాగా, వొక్కాలి వర్గానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. ఓబీసీలు ముగ్గురు, బ్రాహ్మిన్స్ ఇద్దరు, ఇతరులు ఇద్దరు చొప్పున సీఎంగా అయ్యారు.
కర్ణాటక
ప్రమాణ స్వీకారానికి ఇతర రాష్ట్రాల సీఎంలు
రాష్ట్రంలో ఆరుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. వీరేంద్ర పాటిల్ రాజీనామా చేసిన తర్వాత 1971 మార్చి 19న మొదటిసారి అమల్లోకి వచ్చింది.
ఇది దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. కర్ణాటకలో చివరిసారిగా 2007లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల పాటు విధించారు. మే 20న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి రాజా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సెక్రటరీ జనరల్ సీతారాం ఏచూరి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి హాజరవుతారని సమాచారం.