Jammu Kashmir : ఆర్టికల్ 370 తీర్పుపై ఇస్లాం దేశాలు విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత్
జమ్ముకశ్మీర్ కి (Jammu Kashmir) ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నాలుగేళ్ల క్రితం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేయగా.. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కిలిక సదుపాయం మాత్రమేనని అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పుపై దయాది దేశం పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కుతోంది. ఇది చట్టబద్ధత లేని మూర్ఖపు వాదన అని పేర్కొంది.
ఇస్లాం దేశాల గ్రూప్ పై భారత్ ఆగ్రహం
మరోవైపు పాకిస్థాన్ కి ఇస్లాం దేశాల గ్రూప్ 'ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)'' కూడా వంత పాడుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో మంగళవారం ఓఐసీ ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇస్లాం దేశాల గ్రూపుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఐసీ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడారు. మానవ హక్కుల్ని ఉల్లంఘించే వ్యక్తి, ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేసే వారి ఆదేశాల మేరకు ఓఐసీ ఈ వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు. భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ జనరల్ సెక్రటేరియట్ జారీ చేసిన ప్రకటనను భారతదేశం తిరస్కరిస్తుంది.