Page Loader
IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక
నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక

IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గత వందేళ్లలో అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది అక్టోబర్‌లో నమోదు కావడం గమనార్హం. 1901 నుంచి అక్టోబర్‌లో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది 1.23 డిగ్రీల మేర పెరిగడం విశేషం. నవంబర్‌ నెలలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా కొనసాగుతాయని, సాధారణ శీతాకాలం ప్రభావం కనిపించదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ బలహీనపడటం, పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా అభివృద్ధి కాకపోవడం, బంగాళాఖాతంలో తుపాన్లు, వాయుగుండాల ఏర్పాటుతో గాలుల ప్రసారం నిలిచిపోవడం కారణమని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్‌ నెలలో అనేక ప్రాంతాల్లో వేసవిలా ఎండలు నమోదయ్యాయి.

Details

డిసెంబర్, జనవరిలో చలి ప్రభావం ఎక్కువ

వచ్చే రెండు వారాల పాటు వాయవ్య మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల మేర అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. నవంబర్‌ నెల మొత్తాన్ని శీతాకాలంగా పరిగణించలేమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థల అంచనాలకు విరుద్ధంగా పసిఫిక్‌లో ఇప్పటికీ లానినా అభివృద్ధి కాలేదు. అందువల్ల నవంబర్‌లో చలి తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ చివరినాటికి లానినా ఏర్పడే అవకాశం ఉన్నందున, డిసెంబర్, జనవరిలో చలి ప్రభావం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Details

 దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం 

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, నవంబర్‌ నెలలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో అధిక వర్షపాతం రానుంది. ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు ఈశాన్య రుతుపవనాలు కీలకమవుతాయని ఐఎండీ తెలిపింది. ఈ నెలలో ఈ ప్రాంతాల్లో మెరుగైన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.