LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ)- కార్గిల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆగస్టు 2019లో జమ్ముకశ్మీర్ విడిపోయిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత కార్గిల్‌లోని హిల్ కౌన్సిల్‌కు మొదటిసారిగా పోలింగ్ జరుగుతోంది. హిల్ కౌన్సిల్‌లోని 26 స్థానాలకు గానూ 85మంది అభ్యర్థులు పోటీ చేశారు. 95,388 మంది ఓటర్లు బుధవారం వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఈ 95 వేల మంది ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 45 వేలు.
అక్టోబర్ 8న ఫలితాలు
అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. అక్టోబర్ 11లోపు కొత్త కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫిరోజ్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని ప్రస్తుత కౌన్సిల్ తన ఐదేళ్ల పదవీకాలాన్ని అక్టోబర్ 1న పూర్తి చేసుకుంది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకున్న బీజేపీ ఈ సారి ఒంటరిగానే పోటీ చేస్తోంది. బీజేపీ ఈసారి 17మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ సారి ఆప్ నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 25మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారని అధికారులు తెలిపారు.