Jammu Encounter : 'మాజీ పాక్ సైనికులే ఉగ్రవాదులుగా చొరబడ్డారు.. ఇండియన్ ఆర్మీ '
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు,సైన్యం మధ్య మరోసారి భీకర కాల్పులు జరిగాయి. భారత్ సైన్యానికి చెందిన ఇద్దరు కెప్టెన్లు, నలుగురు సైనికులు వీరమరణం పొందారు.గాయపడ్డ వారిని ఉధంపూర్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు పాకిస్థాన్ రిటైర్డ్ సైనికులేనని నార్తర్న్ కమాండ్ జనరల్, కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భయంకరమైన ఉగ్రవాదులు హతమయ్యారని, పాకిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా సుశిక్షితులైన విదేశీ టెర్రరిస్టులే లక్ష్యంగా జవాన్లు పోరాడారని కీర్తించారు. డాంగ్రీ , కండి, రాజౌరిలలో ఉగ్రవాదులు అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్నారని, వారి నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగిస్తామన్నారు.