Haryana Results: హర్యానాలో గెలుపుపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. కలిసిరాని జాట్లు, జిలేబీ..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌కు మింగుడుపడని ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అందరూ కాంగ్రెస్ విజయం సాధించబోతున్నారని ధృడంగా ప్రకటించగా, ఏ సంస్థ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పలేదు. కానీ, వాస్తవ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో మూడోసారి అధికారాన్ని అందుకుంది. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'జాట్లు', 'జిలేబీ' అనే పదాలపై దృష్టి పెట్టారు. ఈ రెండింటిపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకున్నా,చివరకు ఓటుకు మాత్రం దూరంగా ఉండిపోయాయి. 'జిలేబీ' అనే పదాన్ని ప్రస్తావించగానే, హర్యానా గోహనా గుర్తుకు వస్తుంది.ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు,
స్పష్టమైన మెజార్టీతో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ
దీనిని పెద్దఎత్తున తయారు చేసి ఎగుమతి చేయాలని ఆయన సూచించారు, దీనిపై బీజేపీ ఎగతాళి చేసింది. కౌంటింగ్ ప్రారంభమయ్యే ముందు ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యాలయంలో నేతలు గెలుపు సంబరాలు జరుపుకుంటూ, జిలేబీలు తింటున్నారు. లెక్కింపు మొదలైన తర్వాత, కాంగ్రెస్ 60 స్థానాలకు పైగా ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, ఈ ఆనందం ఎంతోసేపు ఉండలేదు.ఫలితాలు మారుతూ, బీజేపీ ముందంజలోకి వచ్చింది. చివరికి, స్పష్టమైన మెజార్టీతో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సంబరాలు జరుపుకుంది. బీజేపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడానికి జిలేబీలను ఆర్డర్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిలేబీ ఆర్డర్ చేయడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీకి రాజకీయ సందేశం పంపినట్లయింది.
రాహుల్ గాంధీకి జిలేబీ ఎలా తయారుచేస్తారనే విషయం తెలియదు
గోహనాలో జరిగిన ర్యాలీలో, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మథురామ్ గుప్తా వంటి వారు తయారు చేసిన జిలేబీలను దేశవ్యాప్తంగా విక్రయించి, ఎగుమతి చేయాలని చెప్పారు, దీని వల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ ప్రకటనలతో, నోట్ల రద్దు కారణంగా మథురామ్ వంటి వ్యాపారులకు నష్టం జరిగినట్లు పరోక్షంగా మోదీపై విమర్శలు చేశారు. అయితే, బీజేపీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాహుల్ గాంధీకి జిలేబీ ఎలా తయారుచేస్తారనే విషయం తెలియదని ఎద్దేవా చేసింది.
250 గ్రాముల జిలేబీ 320 రూపాయలు
ఇక, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గోహానా జిలేబీ గురించి ప్రస్తావించారు. "ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులుండాలి" అని వ్యాఖ్యానించారు. "ప్రధాని పదవి అంటే మథురామ్ జిలేబీ అనుకుంటున్నారా?" అని వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రఖ్యాత గోహానా జిలేబీ 1958లో మథురామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మనవులు రామన్ గుప్తా, నీరజ్ గుప్తా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. 250 గ్రాముల జిలేబీ 320 రూపాయల ధరలో అందుబాటులో ఉంది, ఇది ఒక వారంనాటికి నిల్వ ఉంటుంది.