Page Loader
Kacheguda - jodhpur Train: కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌కు కొత్త రైలు.. ఈ నెల 19న ప్రారంభం 
కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌కు కొత్త రైలు.. ఈ నెల 19న ప్రారంభం

Kacheguda - jodhpur Train: కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌కు కొత్త రైలు.. ఈ నెల 19న ప్రారంభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రం నుంచి రాజస్థాన్‌కు రాకపోకలు చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. హైదరాబాద్‌లోని కాచిగూడ నుండి చారిత్రాత్మక నగరం జోధ్‌పుర్‌కు కొత్త రైలు నడుపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ నెల 19వ తేదీన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి కలిసి ఈ సూపర్‌ఫాస్ట్‌ రైలును ప్రారంభించనున్నారు. కాచిగూడ నుండి జోధ్‌పుర్‌లోని భగత్‌ కీ కోఠీ రైల్వే స్టేషన్ వరకు నడిచే ఈ కొత్త రైలును వారంలో ఏడు రోజులు లేదా కనీసం ఐదు రోజులు నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుండి హిసార్‌ వరకు (జోధ్‌పుర్‌ మార్గంగా) ఉన్న రైలు మాత్రం మంగళవారం, బుధవారం మాత్రమే నడుస్తోంది.

వివరాలు 

 తెలంగాణ నుండి జోధ్‌పుర్‌ వెళ్లే వారి సంఖ్య పెరిగింది 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్‌తో పాటు మంచిర్యాల, వరంగల్‌ వంటి ప్రాంతాల్లో రాజస్థాన్‌కు చెందిన ఎంతోమంది స్థిరపడ్డారు. అలాగే తెలంగాణ నుండి జోధ్‌పుర్‌ వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అందుకే అక్కడికి నేరుగా వెళ్లే రైలు అవసరమని ప్రయాణికులు ఎన్నాళ్లుగానో కోరుతూ వస్తున్నారు. ఇటీవలే తమిళనాడులో చెన్నై నుండి భగత్‌ కీ కోఠీకి నడిపిన కొత్త రైలుకు అనూహ్య స్పందన లభించడంతో, అదే ఆదర్శంగా తీసుకుని కాచిగూడ నుండి కూడా కొత్త రైలు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

ఆర్‌ఎంయూ పనుల పురోగతిని పరిశీలించనున్న కేంద్ర మంత్రి 

కాజీపేటలో నిర్మాణం జరుగుతున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)ను వచ్చే 2026 మార్చి లోపల పూర్తిగా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ తొలుత ఎల్‌హెచ్‌బీ బోగీలు, ఎమ్యూ కోచ్‌ల తయారీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎంయూ నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించనున్నారు అని రైల్వే అధికారులు వెల్లడించారు.