LOADING...
kaleshwaram commission: నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్‌
నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్‌

kaleshwaram commission: నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆనకట్టలపై విచారణ నిర్వహించిన కమిషన్‌ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ సమర్పించింది. ఈ నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. 2024 మార్చి 14న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ మొత్తం 15 నెలల పాటు విచారణ నిర్వహించింది.ఇందులో మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై లోతుగా పరిశీలనలు చేపట్టింది. ఈ కాలంలో మొత్తం 115 మందిని కమిషన్‌ విచారించింది. వారి నుంచి సాక్ష్యాలు సేకరించి, రికార్డు చేసింది. నివేదికను అందించిన అనంతరం, రాహుల్ బొజ్జా నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి (అథవా) రామకృష్ణారావుకు అందించేందుకు సచివాలయానికి బయలుదేరారు.

వివరాలు 

అన్నారం,సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 చివర్లో కుంగిపోవడం, దానికి తోడు పియర్స్ దెబ్బతినడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో అన్నారం,సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు కూడా తలెత్తాయి. ఈ అంశాలపై 2023 డిసెంబర్‌లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టుల్లో ఏర్పడిన లోపాలపై విజిలెన్స్‌ శాఖతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)తో కూడిన ప్రాథమిక స్థాయి పరిశీలన నిర్వహించింది. విజిలెన్స్‌ సమర్పించిన నివేదికలో నిర్మాణాల్లో తీవ్ర లోపాలున్నట్లు స్పష్టం చేసింది. అనంతరం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించనున్నట్లు ప్రకటించారు. వెంటనే దీనికి అనుగుణంగా ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.

వివరాలు 

భారతదేశ మొదటి లోక్‌పాల్‌గా జస్టిస్‌ పీసీ ఘోష్‌

ఈ కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా, అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. అంతేకాదు, 2019 నుంచి 2022 మధ్య భారతదేశ మొదటి లోక్‌పాల్‌గా పనిచేశారు. ఈ ప్రముఖ న్యాయశాఖ నిపుణుడికి 2024 మార్చిలో కమిషన్‌ బాధ్యతలు అప్పగించారు. జూలై చివరికి నివేదికను సమర్పించాల్సిందిగా నిర్ణయించారు. కానీ జస్టిస్ ఘోష్‌ కమిషన్‌ అధికారికంగా ఏప్రిల్‌లో ఉత్తర్వులు స్వీకరించగా, మే నుండి విచారణ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

వివరాలు 

పలు మార్లు కమిషన్ గడువును పొడిగించిన ప్రభుత్వం 

మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల బ్యారేజీలను భౌతికంగా పరిశీలించడమే కాకుండా, అనేక మంది వ్యక్తులను విచారించాల్సి వచ్చింది. దీనికితోడు విజిలెన్స్‌, ఎన్డీఎస్‌ఏ నివేదికలను కూడా సమగ్రమైన పరిశీలన చేయాల్సి రావడం వల్ల కమిషన్ గడువును ప్రభుత్వం పలు మార్లు పొడిగించింది. ఈరోజు (జూలై 31) న్యాయవిచారణ అనంతర నివేదికను జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రభుత్వానికి అధికారికంగా సమర్పించారు. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు భావిస్తున్నారు.