Page Loader
Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా
కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

'థగ్ లైఫ్' సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఉధృతమైన నేపథ్యంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తాను నటించిన 'థగ్ లైఫ్' చిత్రం సంబంధిత కార్యక్రమాలు పూర్తయ్యాకే నామినేషన్ వేయాలని కమల్ భావిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు.ఈ పార్టీ ప్రస్తుతం విపక్షాల INDIA కూటమిలో భాగంగా ఉంది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఎంఎన్‌ఎం మద్దతు ప్రకటించింది.

వివరాలు 

ఎంఎన్‌ఎంకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించిన డీఎంకే

ఆ ఒప్పందం ప్రకారం, తమిళనాడులోని 39లోక్‌సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా ఎంఎన్‌ఎం ప్రచారంలో పాల్గొంది. 2025లో జరగనున్న ఎగువ సభ ఎన్నికల సందర్భంలో ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ స్థానాన్ని ఇవ్వాలని డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ రాజ్యసభ స్థానాన్ని ఎంఎన్‌ఎంకు కేటాయించినట్లు సమాచారం. దీంతో కమల్ హాసన్ రాజ్యసభకు పంపించనున్నారని డీఎంకే-ఎంఎన్‌ఎం నేతలు ఇటీవల స్పష్టం చేశారు. అయితే, ఇటీవల 'థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష జన్మించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడవాదుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

వివరాలు 

కమల్ హాసన్‌పై కర్ణాటక  హైకోర్టు అసహనం

ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) ఈ సినిమా విడుదలను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును మంగళవారం విచారించిన న్యాయస్థానం కమల్ హాసన్‌పై అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పినట్లయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించింది. దాంతో కమల్ హాసన్ తాత్కాలికంగా 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, కమల్ హాసన్ తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న అభిప్రాయంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కి ఓ లేఖ కూడా పంపారు. అయితే, ఆ లేఖలో క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం.