Page Loader
Kamal Haasan: డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌ హాసన్‌..
డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌ హాసన్‌..

Kamal Haasan: డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌ హాసన్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!. తమిళనాడు నుంచి ఆయనకు ఈ అవకాశం లభించబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ డీఎంకే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తమిళనాడు నుంచి 6, అసోం నుంచి 2 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో ఈ స్థాయిలో డీఎంకేకు 134 మంది శాసనసభ్యులు ఉన్న నేపథ్యంలో ఆరు సీట్లలో నాలుగు డీఎంకేకు, మిగిలిన రెండు అన్నాడీఎంకేకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వివరాలు 

2018లో మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ స్థాపన 

ఈ నేపథ్యంలో బుధవారం డీఎంకే తన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కమల్ హాసన్ (70) కూడా ఉన్నారు.మిగిలిన ముగ్గురు అభ్యర్థులు.. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విల్సన్, ప్రఖ్యాత రచయిత సల్మా, డీఎంకే నాయకుడు ఎస్.ఆర్. శివలింగం. దీంతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పవచ్చు. కమల్ హాసన్ 2018, ఫిబ్రవరి 21న మక్కల్ నీతి మయ్యమ్ అనే రాజకీయ పార్టీని మధురైలో ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి ఆ పార్టీ ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీ పోటీ చేసినా, విజయం దక్కలేదు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 3.72 శాతం ఓట్ల వాటా సాధించింది.

వివరాలు 

వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాతో ఓటమి ఓటమిపాలైన కమల్ 

ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురై వంటి పట్టణ ప్రాంతాల్లో వారికి మంచి మద్దతు లభించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమల్ హాసన్ పార్టీ పోటీ చేసింది.కమల్ హాసన్ స్వయంగా కోయంబత్తూరులో పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 140 స్థానాలకు పోటీ చేసినా, ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు.

వివరాలు 

డీఎంకే - ఎంఎన్‌ఎం మధ్య అంగీకారం

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ తన పార్టీ ఎంఎన్‌ఎం ద్వారా ఇండియా కూటమికి (INDIA Alliance) మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా డీఎంకే - ఎంఎన్‌ఎం మధ్య ఒక అంగీకారం జరిగినట్లు తమిళ మీడియా కథనాలు వెల్లడించాయి. కమల్ హాసన్‌కు 'లోక్‌సభకు పోటీ చేయాలా? లేక రాజ్యసభకు వెళ్లాలా?' అనే ఎంపికను డీఎంకే ఇచ్చినట్లు సమాచారం. చివరికి కమల్ రాజ్యసభ వైపు మొగ్గు చూపినట్లు ఆ కథనాల ప్రకారం తెలుస్తోంది.