కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సీఎం ఎవరు అవుతారనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరిలో సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పజెప్పుతూ కర్ణాటక పీసీసీ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో సీఎంను ఖరారు చేసేందుకు సోమవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సిద్ధరామయ్య, డికె శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. మే 18న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరుగుతుందని, దీనికి భావసారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ ఆహ్వానిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
బర్త్ డే బాయ్ శివకుమార్‌కు స్పెషల్ గిఫ్ట్ ఉంటుందా?
ముఖ్యమంత్రి రేసులో ఉన్న డికె శివకుమార్ పుట్టిన రోజు సోమవారం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఏమైనా స్పెషల్ ప్లాన్ చేసిందా? అనే ప్రచారం జరుగుతోంది. పుట్టినరోజు కానుకగా శివకుమార్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని గిఫ్ట్‌గా ఇస్తుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివకుమార్, సిద్ధరామయ్యను ఇద్దరి సంతృప్తి పరిచే మార్గాలను కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమచారం. ప్రధానంగా ఐదేళ్ల పదవీకాలాన్ని రెండున్నరేళ్ల చొప్పున ఇద్దరిని ముఖ్యమంత్రిగా కొనసాగించే ప్రతిపాదనను అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దిల్లీకి బయరుదేరిన ఏఐసీసీ బృందం
బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుడి ఎన్నికకు సంబంధించి ఆదివారం సాయంత్రం సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియా ఏఐసీసీ పరిశీలకులుగా హాజరయ్యారు. దాదాపు ఆదివారం అర్థరాత్రి 1.30 గంటల వరకు సమావేశం కొనసాగింది. సిద్ధరామయ్య, శివకుమార్, వేణుగోపాల్, జైరాం రమేష్‌తో పాటు ఎన్నికైన అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం ఎంపికను ఖర్గే అభీష్టానికే వదిలేశారు. ఏఐసీసీ బృందం ఇప్పటికే దిల్లీకి బయలుదేరింది. దిల్లీకి వెళ్లి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీతో చర్చలు జరిపి, ముఖ్యమంత్రి ఎవరో ఫైనల్ చేయనుంది.