Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?
దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం. కాషాయ పార్టీకి ఎంతో కీలకమైన కర్ణాటకలో టికెట్ల కేటాయింపు బీజేపీని ఇరకాటంలోకి నెట్టిందా? అభ్యర్థుల ఎంపిక విషయంలో హిమాచల్ ఎన్నికల్లో చేసిన తప్పిదమే, కర్ణాటకలో బీజేపీ చేసిందా? కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర పార్టీలో కుంపట్లు రాజేసిందనే చెప్పాలి. హేమాహేమీలైన నాయకులను పక్కన పెట్టి కొత్త వారికి తెరపైకి తేవడంతో రాష్ట్రంలో బీజేపీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. కొందరు దిగ్గజ నాయకులు పార్టీని వీడటం, మరికొందరు రెబల్స్‌గా పోటీ చేస్తుండటంతో ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఏం జరిగిందంటే?
2022లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. తనకు టికెట్ రాకపోవడంతో హిమాచల్ బీజేపీ నాయకురాలు వందనా గులేరియా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. రాష్ట్ర నేతల భవితవ్యాన్ని దిల్లీలోని కొందరు పెద్దలు నిర్ణయిస్తారనే గులేరియా ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. దిల్లీ నుంచి అభ్యర్థుల జాబితా వచ్చినా, ఇక్కడ ఓట్లు వేయాల్సి స్థానికులని వందనా గులేరియా వ్యగంగా అనడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతేకాదు సీనియర్లకు టికెట్లు కేటాయించకపోవడంతో హిమాచల్ ప్రదేశ్‌లో ఫిరాయింపులకు మొదలయ్యాయి. చివరికి రాష్ట్రంలో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మారింది.
కర్ణాటకలో 30స్థానాల్లో రెబల్స్ బెడద
ఇప్పుడు కర్ణాటకలోనూ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితులే పునరావృతం అయ్యాయి. కర్ణాటకలోని 224 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అధిష్టానం అనేక మంది సీనియర్ నాయకులను పక్కన పెట్టి కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. దీంతో టికెట్ రాని నాయకులు బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దాదాపు 30స్థానాల్లో బీజేపీకి రెబల్స్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఈ స్థానాల్లో బీజేపీకి చెందిన కీలకమైన వ్యక్తులు ప్రాతినిధ్య వహిస్తున్నారు. బీజేపీ టికెట్ నిరాకరించిన జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవాది వంటి లింగాయత్ సామాజికి వర్గానికి చెందిన కీలకమైన నాయకులు ఈ 30స్థానాల్లో ఉండటంతో పార్టీ తీవ్రమైన వ్యతిరేతను ఎదుర్కొనే అవకాశం ఉంది.
బీజేపీ జగదీష్ షెట్టర్ రాజీనామాతో లింగాయత్‌లు దూరం అవుతారా?
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రిగా పని చేసి, కర్ణాటక బీజేపీ చీఫ్‌గా పనిచేసిన జగదీష్ షెట్టర్ కాషాయ పార్టీని వీడి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. కర్ణాటకలో 17శాతం ఓట్లు ఉన్న లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ కావడం వల్ల ఇది సామాజిక కోణంలో కూడా బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు జగదీష్ షెట్టర్ మిగతా రాజకీయ నాయకుల మాదిరిగా కాదు. ఆయనకు బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. జగదీష్ షెట్టర్ తండ్రి కూడా బీజేపీలో కీలకమైన నేతగా పనిచేశారు. దీంతో ఇన్నాళ్లు బీజేపీకి మద్దతుగా నిలిచిన లింగాయత్ ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్‌కు షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది?
బీజేపీలో టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకులు, ఆశావహుల్లో అనేక మంది ఇతర పార్టీల్లో చేరారు. కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. ఇతర పార్టీల్లోకి చేరిన వారిలో చాలా మందికి ఆయా పార్టీలు టికెట్లను కూడా ఇచ్చాయి. ఈ పరిణామం బీజేపీకి కాస్త ఇబ్బంది కరమే అని చెప్పాలి. ఒక వైపు సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ, ఫిరాయింపులకు అడ్డుకట్టే వేసి, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.