కేజీఎఫ్ కాపీ రైట్ కేసులో రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. పిటిషన్ కొట్టివేత
కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. అందులో భాగంగానే రాజకీయ ప్రచారానికి కేజీఎఫ్-2 మ్యూజిక్ ఉపయోగించారని సదరు మ్యూజిక్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కాపీరైట్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎంఆర్టీ మ్యూజిక్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ సహా మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తో పాటు మరో ముగ్గురిపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిసిటీ శాఖ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా లీడ్ సుప్రియా శ్రీనాథ్ లు హైకోర్టును ఆశ్రయించారు.
ఆర్థిక లాభాలు పొందకున్నా, ప్రజాదరణ పొందారు : హైకోర్టు
ఈ మేరకు కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం సదరు పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అసలు కేజీఎఫ్-2 సినిమా పాటల హక్కులు ఎవరికి చెందుతాయని, అవి ఎవరి సొంతమంటూ పిటిషన్ దారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆడియో, వీడియో వినియోగించుకునేందుకు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కాపీ రైట్స్ ఉల్లంఘించినట్లు సంస్థ కోర్టుకు వివరించింది. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే రాహుల్ న్యాయవాదుల వాదనతో ఏకీభవించని కోర్టు, ఆర్థిక లాభాలు పొందకున్నా, ప్రజాదరణ పొందారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.