Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం
పీచు మిఠాయి, కృత్రిమ రంగులతో చేసిన గోబీ మంచూరియాలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వాటి తయారీ, విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వస్తువుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు పేర్కొన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, గోవా ప్రభుత్వాలు పీచు మిఠాయి, గోబీ మంచూరియా అమ్మకాలపై నిషేధం విధించిన నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య శాఖకు కూడా అప్రమత్తమైంది. ఈ మేరకు ఆహార భద్రత అధికారులు బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి 200 కంటే ఎక్కువ నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపారు. ఆ పరీక్షల్లో క్యాన్సర్ కలిగించే రసాయనాలను గుర్తించారు.
గోబీ నమూనాల్లో క్యాన్సర్ కారకాలు
ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు పరీక్ష ఫలితాల వివరాలను వెల్లడించారు. 171 గోబీ నమూనాలను పరీక్షలకు పంపగా.. 107 నమూనాల్లో టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో, కార్మోసిన్ కలర్ వంటి క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అదేవిధంగా, పీచు మిఠాయి 25 నమూనాలను పరీక్షించగా.. 15 నమూనాల్లో టార్ట్రాజైన్, రోడమైన్-బి వంటి కృత్రిమ, క్యాన్సర్ కారక రసాయనాలకు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆహార పదార్థాల విక్రయాలపై ఎలాంటి నిషేధం విధించే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. కానీ, గోబీ, పీచు మిఠాయిల్లో కృత్రిమ, రసాయనాలను ఉపయోగించే వారికి వ్యతిరేకంగా మాత్రమే తాము వ్యవహరిస్తున్నామన్నారు.