Kumaraswamy: మైనింగ్ లీజు కేసులో కుమారస్వామి విచారణకు అనుమతివ్వాలని కర్ణాటక గవర్నర్‌కు పోలీస్ శాఖ విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
తనపై ఉన్న అవినీతి కేసు విచారణను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఇదే అభిప్రాయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా వ్యక్తం చేసింది. కర్ణాటక హైకోర్టు నాలుగేళ్ల క్రితం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది.
న్యాయస్థానాల్లో ఉపశమనం లభించకపోవడంతో, కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
కుమారస్వామిని విచారించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర పోలీసు శాఖ గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో కన్నడ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
వివరాలు
రెండు ప్లాట్లను కుమారస్వామి డీ-నోటిఫై
బెంగళూరు దక్షిణ తాలూకాలోని ఉత్తరహళ్లి హోబీలోని హలగేవడేరహళ్లి గ్రామంలో ఉన్న రెండు ప్లాట్లను కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీ-నోటిఫై చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
బీడీఏ అభ్యంతరాలు తెలిపినప్పటికీ, 2007లో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఆ భూమిని డీ-నోటిఫై చేయాలని ఆదేశించారని, 2010లో ఆ భూమిని ప్రైవేట్ పార్టీలకు రూ.4.14 కోట్లకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
4,500 పేజీల చార్జ్‌షీట్
అలాగే, బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో కూడా కుమారస్వామి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఇప్పటికే విచారణ జరుగుతుండటంతో, ఆయనను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఎస్‌ఐటీ బృందం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది.
అయితే, చార్జ్‌షీట్ కన్నడ భాషలో ఉందని, దాన్ని ఆంగ్లంలోకి అనువదించి అందించాలని రాజ్‌భవన్ అధికారులు సూచించారు.
దాంతో, దాదాపు 4,500 పేజీల చార్జ్‌షీట్‌ను ఇంగ్లీష్‌లోకి మార్పు చేసి సమర్పించారు.
ఈ క్రమంలో గవర్నర్ అనుమతి ఇచ్చినట్లయితే, ఎస్‌ఐటీ అధికారుల ఎదుట కుమారస్వామి విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.