కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు
కర్తార్ పూర్ కారిడార్ యాత్ర మంగళవారం పునఃప్రారంభమైంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను భారతదేశంలోని గురుదాస్‌పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్‌తో కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్‌కు నిర్మాణం చేశారు. భారత, పాక్ సరిహద్దుల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం నుంచి కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభమైంది. భారీ వరదల నేపథ్యంలో సోమవారం సాయంత్రం సరిహద్దు రేంజ్ అమృత్‌సర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) నరీందర్ భార్గవ్ కారిడార్‌ను సందర్శించారు. అనంతరం అక్కడి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఇరుదేశాల మధ్య కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర నవంబర్ 9, 2019న ప్రారంభమైంది.
యాత్రకు 132 మంది సిక్కు భక్తులు పేర్లు నమోదు
గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల ధాటికి సరిహద్దుల్లోని రావి నది నీటి మట్టం అమాంతం పెరగడంతో భారత్ - పాక్ సరిహద్దులో వరదలు సంభవించాయి. ఈ కారణంగా గతంలోనే యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఐజీ నరీందర్ భార్గవ్ వెల్లడించారు. ప్రస్తుతానికి అక్కడ యథాస్థితి పరిస్థితి నెలకొనడంతో మంగళవారం నుంచి కారిడార్‌ను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు నరీందర్ వివరించారు. మరోవైపు గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ సైతం కర్తార్‌పూర్ కారిడార్‌లో పర్యటించారు. మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్న కర్తార్‌పూర్ కారిడార్ యాత్రకు 132మంది సిక్కు భక్తులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.