LOADING...
Israel: ఇజ్రాయెల్‌-జోర్డాన్ బోర్డర్‌లో కాల్పులు.. కేరళకు చెందిన థామస్ గాబ్రియేల్ మృతి
ఇజ్రాయెల్‌-జోర్డాన్ బోర్డర్‌లో కాల్పులు.. కేరళకు చెందిన థామస్ గాబ్రియేల్ మృతి

Israel: ఇజ్రాయెల్‌-జోర్డాన్ బోర్డర్‌లో కాల్పులు.. కేరళకు చెందిన థామస్ గాబ్రియేల్ మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళ రాష్ట్రం, తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ ప్రాణాలు కోల్పోయాడు. గాబ్రియేల్ కేరళలో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తూ, టూరిస్ట్ వీసా ద్వారా జోర్డాన్‌కు వెళ్లాడు. అయితే, అక్కడి నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అతనిపై కాల్పులు జరిపారు, దీని వల్ల అతడు అక్కడికక్కడే మరణించాడు. గాబ్రియేల్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి సహాయం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భద్రతా దళాల కాల్పుల్లో గాబ్రియేల్ మరణించాడని, ఈ విషయం అతని కుటుంబానికి అమ్మాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది.

వివరాలు 

భారత రాయబార కార్యాలయం విచారణ

ఫిబ్రవరి మొదటి వారంలో గాబ్రియేల్ టూరిస్ట్ వీసాతో జోర్డాన్ వెళ్లాడని, అయితే అతను ఇజ్రాయెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తమకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 10న భద్రతా దళాలు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా, అతను మాట వినకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈ-మెయిల్‌లో పేర్కొంది. బుల్లెట్ తలలో తగిలిన కారణంగా అతడు అక్కడికక్కడే మరణించాడని, అనంతరం అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. అయితే, ఏ ఆస్పత్రిలో ఉంచారో స్పష్టత లేకపోయినా, భారత రాయబార కార్యాలయం విచారణ జరుపుతుందని తెలిపారు.

వివరాలు 

మృతుడి కుటుంబంతో సంప్రదింపులు

గాబ్రియేల్ చివరిసారిగా ఫిబ్రవరి 9న తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడని, ఆ తర్వాత నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని అతని బంధువులు తెలిపారు. అతను బస చేసిన ప్రదేశంలో సురక్షితంగా ఉన్నాడని అనుకున్నామని, కానీ అనంతరం కాల్ చేసి అకస్మాత్తుగా కట్ చేశాడని, అప్పటి నుంచి తిరిగి ఫోన్ కాల్ రాలేదని వివరించారు. భారత రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో స్పందిస్తూ, ''దురదృష్టవశాత్తు ఒక భారతీయ పౌరుడు మరణించాడని సమాచారం. మృతుడి కుటుంబంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు జోర్డాన్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం'' అని పేర్కొంది.