Polavaram : పోలవరం నిర్మాణంపై కీలక సమీక్షలు.. రేపు సీఎంతో నిర్మాణ సంస్థల భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నిర్మాణ సంస్థలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, సలహాదారు-ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు వర్చువల్ సమావేశంలో హాజరుకానున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం వంటి కీలక పనులకు ఇంకా సమయం పడతుందని మేఘా ఇంజనీరింగ్ స్పష్టం చేసింది.
2029 నాటికి పనులు పూర్తియ్యే అవకాశం
కేంద్రీయ జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ 2024 నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపేజీ జలాల కారణంగా ఈ గడువులోగా పనులు పూర్తి చేయడం కష్టతరమని తెలుస్తోంది. మేఘా ఇంజనీరింగ్ ప్రకారం, డయాఫ్రం వాల్ 2026 ఫిబ్రవరి నాటికి పూర్తియ్యే అవకాశం ఉంది. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం కోసం మూడు సీజన్లు అవసరమని, 2029 నాటికి మాత్రమే పూర్తయ్యే అవకాశముందని మేఘా సంస్థ అంచనా వేస్తోంది.