Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..!
కర్ణాటకలో ముడా స్కాంపై కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్, కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) మంజూరు చేసిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ భూమి కర్ణాటక ప్రభుత్వం ద్వారా బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో కేటాయించారు. సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు భూమి కేటాయింపుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ట్రస్ట్‌లో మల్లిఖార్జున్ ఖర్గే, ఆయన కుమారుడు రాహుల్ ఖర్గే, అల్లుడు రాధాకృష్ణ సభ్యులుగా ఉన్నారు.
భూ కేటాయింపులో అవకతవకలు
భూమి కేటాయింపు పద్ధతిలో అవకతవకలు జరిగాయని దినేష్ కల్లహల్లి అనే వ్యక్తి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై సీరియస్‌గా స్పందించిన ఖర్గే కుటుంబం, ట్రస్టుకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. రాహుల్ ఖర్గే నేతృత్వంలోని ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం పై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు చేశారు.
సీఎంపై మనీలాండరింగ్ కేసు
ప్రభుత్వ అధికార దుర్వినియోగంతోనే భూమి కేటాయించారని ఆయన ఆరోపించారు. అయితే కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ, రాహుల్ ఖర్గే దరఖాస్తు ఆధారంగా అన్ని అర్హతలను పరీక్షించి మెరిట్ పద్ధతిలోనే భూమిని కేటాయించినట్లు స్పష్టం చేశారు. కర్ణాటకలో ముడా స్కాం ప్రస్తుత రాజకీయాల్లో పెద్ద వివాదం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కూడా మనీలాండరింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.