Page Loader
Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ
కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం

Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇటీవల 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశాల్లో బచావత్‌ ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపులు, కృష్ణా ట్రైబ్యునల్‌ చేసిన అదనపు కేటాయింపులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరు అంశాలను ట్రైబ్యునల్‌ ముందుంచిన అనంతరం,ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి పంపిణీ బాధ్యతను బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు అప్పగించినట్లు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం పేర్కొంటుంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయించడమే కాకుండా, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వినియోగం ఎలా ఉండాలో తీర్పు ఇవ్వాల్సిన బాధ్యతను కూడా కేంద్రం ట్రైబ్యునల్‌కు అప్పగించింది.

వివరాలు 

తదుపరి విచారణ సెప్టెంబరు 20

తెలంగాణ బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం విచారణ జరగాలని కోరింది. కేంద్రం ఈ విన్నపానికి అంగీకరించి, ట్రైబ్యునల్‌కు ఆదేశాలు పంపింది. దాంతో రెండు రాష్ట్రాలు తమ వాదనలు, ప్రతివాదనలు దాఖలు చేయడంతో పాటు అదనపు అంశాలు జోడించాయి. ఈ అంశాలపై దిల్లీలో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట వాదనలు కొనసాగాయి. వాదనలు పూర్తయిన తర్వాత ట్రైబ్యునల్‌ అన్ని 40 అంశాలపైనా విచారణ జరపాలని నిర్ణయించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 20న ప్రారంభం కానుంది.

వివరాలు 

ట్రైబ్యునల్‌ నిర్ణయించిన విచారణాంశాల్లో ముఖ్యమైనవి ఇవీ: 

కృష్ణా జల వివాదంలో ట్రైబ్యునల్‌-1 కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ట్రైబ్యునల్‌-2 చేసిన అదనపు కేటాయింపుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల వాటాలను ఖరారు చేయడం. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్ధారించే ముందు కృష్ణా జలాల్లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉన్నదో నిర్ణయించడం. బచావత్‌ ట్రైబ్యునల్‌ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు రక్షణ కల్పించడంపై ట్రైబ్యునల్‌కు విచారణ హక్కు ఉందా అనే అంశంపై చర్చ. బచావత్‌ ట్రైబ్యునల్‌ పరిధిలో ఉండని ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందా అన్నదాని పై చట్ట ప్రకారం విచారణ జరపడం. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం గతంలో కేటాయించిన ప్రాజెక్టులను పునఃసమీక్ష చేయాలా లేదా అనే అంశం.

వివరాలు 

ట్రైబ్యునల్‌ నిర్ణయించిన విచారణాంశాల్లో ముఖ్యమైనవి ఇవీ: 

రాష్ట్ర పునర్విభజన కారణంగా నీటి పంపిణీ, ప్రాజెక్టుల వారీ కేటాయింపుల విషయంలో బేసిన్లను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది. నాగార్జునసాగర్‌ కాలువలు, కేసీ కాలువ, హెచ్చెల్సీల కింద సాగు అవసరాలను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందా? ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం, పంటల విధానం, సాగునీటి అవసరాలను నిర్ణయించడం. ప్రాజెక్టుల కేటాయింపులు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా డెల్టా, తుంగభద్ర హెచ్చెల్సీ, నాగార్జునసాగర్‌ ఎడమ, కుడి కాలువలకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సిన అవసరం ఉందా? పులిచింతలకు నీటిని పంపింగ్‌ చేయడానికి, కొత్త బ్యారేజీల నిర్మాణాన్ని ప్రతిపాదించడం. కృష్ణా బేసిన్‌లోని పులిచింతలలో నిల్వ నీటిని సాగర్‌ కాలువల ద్వారా వినియోగించే అంశాన్ని పునః పరిశీలించడం.

వివరాలు 

ట్రైబ్యునల్‌ నిర్ణయించిన విచారణాంశాల్లో ముఖ్యమైనవి ఇవీ: 

తెలంగాణలోని ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలను సాగునీటి కేటాయింపుల నుంచి మినహాయించే అవకాశాన్ని పరిశీలించడం. పోలవరం నుండి మళ్లించే గోదావరి నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంచే అధికారం ప్రస్తుత ట్రైబ్యునల్‌కు ఉందా అనే విషయాన్ని పరిశీలించడం. ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, తాగునీటి అవసరాలకు కేటాయింపులు చేసేందుకు వీలుందా అనే అంశాలను ట్రైబ్యునల్‌ పరిశీలిస్తోంది. ఇలా మొత్తం 40 అంశాలను ట్రైబ్యునల్‌ ప్రతిపాదించింది.

వివరాలు 

శ్రీశైలంలో ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ! 

శ్రీశైలం జలాశయంలో ఉత్సాహంగా ప్రవహిస్తున్న కృష్ణా నది దృశ్యం ముచ్చటగా మారింది. గురువారం శ్రీశైలం జలాశయ 10 గేట్లు ఎత్తి, 2,79,830 క్యూసెక్కుల నీటిని స్పిల్‌ వే ద్వారా విడుదల చేశారు. విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన 68,405 క్యూసెక్కుల నీరు కూడా నాగార్జునసాగర్‌ వైపు విడుదల అవుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,86,434 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలో 214.3637 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.