Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జునసాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు ముందుగా సమావేశమై, నీటి అవసరాలను ముందు పక్కాగా తేల్చాలి.
కుడి, ఎడమ కాలువల కింద ఎంత భూభాగం సాగుకు ఉంది? ఆయకట్టు అవసరాలను తీర్చేందుకు ఎన్ని తడులు అవసరమో స్పష్టత ఇవ్వాలి. తాగునీటి అవసరాల వివరాలు గణించాలి.
రెండు రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని, బుధవారం కృష్ణా బోర్డు మళ్లీ సమావేశమై శ్రీశైలం, సాగర్ జలాశయాల్లోని నీటి నిల్వల ఆధారంగా జూన్ నెల వరకు నీటి కేటాయింపులను నిర్ణయించనుంది.
ఈ అత్యవసర సమావేశం సోమవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగింది.
వివరాలు
తెలంగాణ వాదన
ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
సాగర్ చీఫ్ ఇంజినీర్ల సమావేశం ఆలస్యమైతే బోర్డు సమావేశం కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.
నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగించుకుంది.ఈ ఏడాది ఏపీ వాటాగా 666 టీఎంసీలు ఉండగా,ఇప్పటికీ 639 టీఎంసీలకుపైగా వాడుకుంది.
శ్రీశైలం నుంచి కూడా ఎక్కువగా నీటిని మళ్లించింది.తెలంగాణ మాత్రం 211 టీఎంసీలే వినియోగించింది.
ఉమ్మడి జలాశయాల నుంచి ఇక ఏపీ నీటిని వినియోగించకుండా ఆపాలని,జూన్ వరకు సాగుకు 90 టీఎంసీలు,తాగునీటి అవసరాలకు 17 టీఎంసీలు,జూలైలో మరో 9 టీఎంసీలు అవసరమని తెలంగాణ ప్రతినిధులు రాహుల్ బొజ్జా,అనిల్‌కుమార్ వాదించారు.
వివరాలు
విద్యుదుత్పత్తిపై వివాదం
సోమశిల,కండలేరు,గండికోట జలాశయాల్లో ఏపీకి నీరు అందుబాటులో ఉందని గుర్తుచేశారు.
కృష్ణా బోర్డు నిబంధనల ప్రకారం, వరద నీరు వదిలే సమయంలోనే విద్యుదుత్పత్తి చేయాలి.
అయితే, తెలంగాణ ఈ నియమాన్ని పాటించలేదని, వరద లేకున్నా 117 టీఎంసీలను విద్యుదుత్పత్తికి వినియోగించిందని ఏపీ ఆరోపించింది.
వరద నీరు లభించినపుడు ఏపీ మళ్లింపు చేసుకోవడం తప్పేం కాదని పేర్కొంది. గతంలో మళ్లించిన నీటి లెక్కలు ఇప్పుడు తీసుకురావడం అనుచితమని అభిప్రాయపడింది.
వివరాలు
బోర్డు నివేదిక
బోర్డు ఛైర్మన్ అతుల్‌జైన్ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ వరద సమయంలోనే నీటిని వినియోగించింది.
నవంబరులో వరదలొచ్చిన తర్వాత జలాశయాల్లో నీటి నిల్వ పెరిగింది. ఏపీ వినియోగించినది వరద నీటేనని లెక్కలు చెబుతున్నాయి," అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, రాష్ట్రాల ఆయకట్టుకు ఇబ్బంది కలగకుండా నీటి కేటాయింపులను చేయాలని ఏపీ చీఫ్ ఇంజినీర్ సూచించారు.
అన్ని అవసరాలను పక్కాగా నిర్ణయించి, తగిన నీటి పంపిణీకి బోర్డు అంగీకరించింది.
ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో కలిపి 66 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జూన్ తర్వాత తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం 800 అడుగుల దిగువన 16 టీఎంసీలు, సాగర్‌లో 510-500 అడుగుల మధ్య 15 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. మిగిలిన నీటిని అవసరాలను అనుసరించి పంచుతారు.