
KTR: ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఏ పార్టీకి మద్ధతు ఇస్తుందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఉపరాష్ట్రపతి ఎన్నికలలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఇండియా కూటమి అనూహ్యంగా తెలంగాణకు చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతి బరిలోకి తీసుకురావడమే దీనికి కారణం. రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈ కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలొ, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకతీతంగా, తెలంగాణకు చెందిన వ్యక్తికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. గతంలో ఎన్టీఆర్ చూపించిన ఐక్యతను మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.
వివరాలు
అసలు బాస్‌లు తెలంగాణ ప్రజలే
ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తమకు ఎవరు బాస్‌లు కాదని, అసలు బాస్‌లు తెలంగాణ ప్రజలే అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏ పార్టీ నేతలు తమను సంప్రదించలేదని కూడా పేర్కొన్నారు. కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ను 'థర్డ్ క్లాస్ చిల్లర పార్టీ'గా విమర్శించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వారికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి దొరకలేదా..? కంచె ఐలయ్య వంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదా..? అని ప్రశ్నించారు. కంచె ఐలయ్యని పెడితే బేషరత్తుగా మద్ధతు ఇచ్చేవారమని చెప్పారు.
వివరాలు
ఆరు నెలల ముందే యూరియా స్టాక్
సెప్టెంబర్ 9 వరకు రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఎవరు అందిస్తే, వాళ్లకే తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. రైతులు యూరియా కోసం లైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ పాలనలో ఒక బస్తా ఎరువూ లభించలేదని, రైతులు అధికారుల కాళ్లను పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందే యూరియా స్టాక్ తెపించి, రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని చెప్పారు.
వివరాలు
ప్రభుత్వం, సీఎం వైఫల్యం వల్లే మహబూబాబాద్‌లో రైతులపై లాఠీ చార్జ్
కాంగ్రెస్‌కి పరిపాలన చేతకావడం లేదని.. కనీస అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం, సీఎం వైఫల్యం వల్లే మహబూబాబాద్‌లో రైతులపై లాఠీ చార్జ్ జరిగినట్లు కేటీఆర్ తెలిపారు. అంతేకాక, పొట్టకూటి కోసం వచ్చినవారితో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా ఉండడం ద్వారా మాత్రమే సుస్థిరత సాధ్యమని, అదే వారి ప్రధాన భావన అని కేటీఆర్ మరల తెలిపారు.