Vijayawada: విజయవాడ మెట్రో రైలుకి తొలి అడుగు.. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాలకి ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి తొలి అడుగు పడింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 91 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) అధికారులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.
తొలి దశలో గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్, పెనమలూరు నుంచి పీఎన్‌బీఎస్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు.
మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలను సిద్ధం చేసి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషకు అందజేశారు.
ప్రస్తుతం జిల్లా యంత్రాంగం భూసేకరణ అంశాలపై దృష్టి సారించింది.
త్వరలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, మెట్రో రైల్ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించి భూసేకరణ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
వివరాలు
1వ కారిడార్ (26 కిలోమీటర్లు)
పీఎన్‌బీఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వేస్టేషన్‌ను కలుపుతూ, ఏలూరు రోడ్ మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారికి చేరుకొని, అక్కడి నుంచి గన్నవరం వరకు విస్తరించనుంది.
ఈ మార్గంలో మెట్రో గన్నవరం, యోగాశ్రమం, విమానాశ్రయం, వేల్పూరు, గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమానూరు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తా మీదుగా జాతీయ రహదారిపై ప్రయాణించి, అనంతరం ఏలూరు రోడ్డులోకి మారి, గుణదల, పడవలరేవు, మాచవరండౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్, చివరకు పీఎన్‌బీఎస్ వద్ద ముగుస్తుంది.
వివరాలు
రెండు కారిడార్లకు భూసేకరణ
ప్రారంభంలో విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం కోసం నాలుగు కారిడార్లు ప్రతిపాదించగా, ప్రస్తుతానికి రెండు కారిడార్లపైనే దృష్టి సారించారు. ఈ రెండు కారిడార్లు పీఎన్‌బీఎస్ వద్ద కలిసేలా భూసేకరణ చేపట్టనున్నారు.
2వ కారిడార్ (12.5 కిలోమీటర్లు)
ఈ మార్గం పీఎన్‌బీఎస్ నుంచి ప్రారంభమై, బందరు రోడ్డులో విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజి సర్కిల్, ఆటోనగర్, అశోకనగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి మీదుగా పెనమలూరు వరకు విస్తరించనుంది.
వివరాలు
ప్రాజెక్ట్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం
ఈ రెండు కారిడార్లలో మొత్తం 34 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, టెండర్లను పిలిచారు.
అయితే, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టడం వల్ల ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు.
మొత్తం 91 ఎకరాల భూమి రెండు జిల్లాల్లో అవసరం. ప్రారంభంలో నిడమానూరులో కోచ్ డిపో ఏర్పాటు చేయాలని భావించినా, ప్రస్తుతం కేసరపల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భూసేకరణ కోసం విజయవాడలో 30 ఎకరాలు, మిగతా భూమి కృష్ణా జిల్లా పరిధిలో అవసరమని అధికారులు గుర్తించారు.
దీనిని పూర్తిచేసేందుకు రెండు జిల్లా యంత్రాంగాలు కలిసి భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నాయి.