
AP Cabinet Decisions: రాజధాని అమరావతిలో 34వేల ఎకరాల భూసమీకరణ.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 19 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఈ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల నివాస సముదాయ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో దశగా చేపట్టనున్న 34,964 ఎకరాల భూసమీకరణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వివరాలు
రాజధాని పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థగా 'క్వాంటమ్ కంప్యూటింగ్' ఏర్పాటు
ఈభూసేకరణ 13గ్రామాల పరిధిలో జరగనుంది. సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు,క్రీడా అకాడమీ వంటి వాటికి అవసరమైన భూముల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేగాక, రాజధాని పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థగా'క్వాంటమ్ కంప్యూటింగ్'ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో భూమిలేని సుమారు 1,575పేద కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న పింఛన్లు మంజూరు చేయడంపై మంత్రివర్గం ఓకే చెప్పింది. రాజధాని నిర్మాణంలో అవసరమైన ఇసుకను కృష్ణా నదిలో నుంచి డ్రెడ్జింగ్ ద్వారా సేకరించేందుకు సీఆర్‌డీఏకి అనుమతి ఇచ్చింది. జలవనరుల శాఖ పరిధిలో మొత్తం 71 పనులకు అనుమతి ఇచ్చిన మంత్రివర్గం,వివిధ మాధ్యమ ప్రాజెక్టుల మరమ్మతుల కోసం నిధులు కూడా మంజూరు చేసింది.
వివరాలు
హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం
కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయాల కోసం హడ్కో ద్వారా వెయ్యి కోట్ల విలువైన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా అనుమతి ఇచ్చింది. 'ఏపీ జలజీవన్ నీటి సరఫరా కార్పొరేషన్' ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ చట్టంలో కొన్ని సవరణలు చేయడానికి, పరిశ్రమలు, కార్మిక సంబంధిత చట్టాల్లో మార్పులకు కూడా ఆమోదం తెలిపింది.
వివరాలు
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏపీఐఐసీ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి అదనంగా 790 ఎకరాల భూమి సేకరణకు అనుమతి. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 2025-30కు మంత్రివర్గ ఆమోదం. నెల్లూరు జిల్లాలో పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ మరియు ఆరు యూనిట్ల స్థాపనకు ఆమోదం. కోకో సాగు చేస్తున్న రైతులను ఆదుకునేందుకు రూ.14.88 కోట్ల నిధుల మంజూరుకు మంత్రివర్గ ఆమోదం.