Pappu Yadav: 'సల్మాన్ ఖాన్ కేసుకు దూరంగా ఉండు'.. బీహార్ ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య వంటి అంశాలతో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ (Pappu Yadav) కు ఆ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, సల్మాన్ ఖాన్‌కు చెందిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని పప్పూ యాదవ్‌కు హెచ్చరించారు.
సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు
సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు చేసినా, పట్టించుకోకుంటే చంపేస్తామని, ఎప్పటికప్పుడు కదలికలను గమనిస్తున్నామని పప్పూ యాదవ్‌కు బెదిరింపులు వచ్చాయని సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ జైలులో గంటకు రూ. లక్ష చెల్లించి సిగ్నల్ జామర్లను నిలిపివేస్తున్నాడు, ఆ తర్వాత యాదవ్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు అని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ కాల్స్‌ను యాదవ్ పట్టించుకోలేదని సమాచారం. "సాధ్యమైనంత త్వరగా భాయ్‌తో సెటిల్‌మెంట్ చేసుకోండి. మిమ్మల్ని పెద్దన్నయ్యగా భావించాను. కానీ మీరు ఇబ్బంది పెట్టారు. తిరిగి కాల్ చేస్తే.. మిమ్మల్ని భాయ్‌తో కనెక్ట్ చేస్తా" అని రికార్డ్ చేసిన ఆడియో సందేశంలో ఈ మాటలు వినిపించాయి. ఈ విషయంపై యాదవ్ పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యతను తీసుకుంది. ఈ విషయంపై అప్పట్లో యాదవ్ స్పందించి, ఆ గ్యాంగ్‌కు బహిరంగ సవాలు విసిరారు. "24 గంటల్లో ఆ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేస్తానని" వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "బిహార్ బిడ్డ (సిద్దిఖీ పట్నాలో జన్మించారు) హత్యకు గురికావడం అత్యంత విషాదకరం. ఇలాంటి ప్రముఖ వ్యక్తులనే బీజేపీ ప్రభుత్వం కాపాడలేకపోతే, సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నించారు. బిష్ణోయ్ గ్యాంగ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి.