
High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలోని అనేక సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో కొన్నిప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత, విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం, అధికారుల సెలవులను రద్దు చేయడం వంటి కీలక చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌తో పాటు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు తగిన భద్రతా చర్యలకు ఉపక్రమించాయి.
వివరాలు
పంజాబ్‌లో విద్యుత్ కట్, స్కూళ్ల మూత
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది.
సరిహద్దులో ఉన్న ఆరు జిల్లాల్లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఫెరోజ్‌పుర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, అమృత్‌సర్, గుర్‌దాస్‌పుర్, తర్న్ తరన్ జిల్లాల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అన్ని విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు ప్రకటించారు.
చంఢీగడ్ సహా మరికొన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి ఆమన్ ఆరోరా వెల్లడించారు.
వివరాలు
హరియాణాలో వైద్య, పోలీసు సిబ్బందికి సెలవుల రద్దు
హరియాణా రాష్ట్రంలో పోలీసులతో పాటు ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు.
వారంతా విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఉండాలని, జిల్లా కేంద్రాల నుంచి బయటకు వెళ్లవద్దని సివిల్ సర్జన్లకు ఆదేశాలు జారీ చేశారు.
దిల్లీలో ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర సూచనలు
ఢిల్లీలో కూడా ప్రభుత్వం అన్ని అధికారుల సెలవులను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
అత్యవసర పరిస్థితులపై ముందస్తు అప్రమత్తతతో.. సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని స్పష్టం చేసింది.
వివరాలు
హిమాచల్ ప్రదేశ్‌లో భద్రతా చర్యలు
పంజాబ్ సరిహద్దులో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.
హమీర్‌పుర్, ఉనా, బిలాస్‌పుర్ వంటి సరిహద్దు జిల్లాల్లో భద్రతను పెంచారు.
బాబా బాలక్‌నాథ్, మాతా చింత్‌పుర్నీ, మాతా నైనా దేవీ వంటి ప్రముఖ దేవాలయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
వివరాలు
రాజస్థాన్‌లో బ్లాక్‌ఔట్, విమాన సేవలు నిలిపివేత
రాజస్థాన్ ప్రభుత్వం కూడా పోలీసు మరియు ఇతర శాఖల అధికారుల సెలవులను రద్దు చేసింది.
సరిహద్దులో ఉన్న ఐదు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు.
పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మర్, జైసల్మేర్, జోధ్‌పుర్ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
గంగానగర్ పోలీసులు ప్రజలు రాత్రి లైట్లు ఆర్పివేయాలని సూచించారు. మే 10 వరకు బికనెర్, అజ్మీర్‌లోని కిషన్‌గఢ్, జోధ్‌పుర్ విమానాశ్రయాల్లో విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
గుజరాత్‌లో తీర ప్రాంతాల్లో గస్తీ పెంపు
గుజరాత్‌లో భూ, సముద్ర సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరంగా చేపట్టారు.
పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసి, సెలవుల్లో ఉన్నవారిని తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.
రాజ్‌కోట్ రేంజ్, జామ్‌నగర్, మోర్బీ, దేవ్‌భూమి ద్వారక వంటి తీరప్రాంత జిల్లాల్లో పోలీసు గస్తీలు పెంచారు.
అనుమానాస్పద కదలికలపై వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలు, సర్పంచ్‌లకు సూచించారు.
వివరాలు
పశ్చిమ బెంగాల్, బిహార్‌లో ఉద్యోగులకు తిరోగమనం ఆదేశాలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.
ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని అధికారికంగా ఆదేశించారు. బిహార్ రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలనే అనుసరించి, అప్రమత్తత చర్యలు చేపట్టింది.