Election Schedule: మహారాష్ట్ర.. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో నవంబర్ 20 (బుధవారం)న పోలింగ్ నిర్వహించనున్నారు. జార్ఖండ్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించబడుతుంది. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండగా, జార్ఖండ్‌లో 2025, జనవరి 5తో కాలపరిమితి ముగుస్తుంది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉండగా, 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
జమ్మూ-కాశ్మీర్‌లో ప్రశాంతంగా పోలింగ్
హర్యానా, జమ్మూ-కాశ్మీర్‌లో విజయవంతంగా పోలింగ్ ముగిసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూ-కాశ్మీర్‌లో ఎలాంటి హింస జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని స్పష్టం చేశారు. ఇటీవల హర్యానా,జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. హర్యానాలో బీజేపీ విజయం సాధించగా,జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి గెలిచింది. అయితే, ఇంకా ఎక్కడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడలేదు.
జార్ఖండ్ లో నవంబర్ 13,20 ఎన్నికలు.. 23 నవంబర్ కౌంటింగ్
మహారాష్ట్రలో నవంబర్ 20 ఎన్నికలు.. 23 నవంబర్ కౌంటింగ్
మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలు
'మహారాష్ట్రలో 36 జిల్లాల్లో మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 234 జనరల్ సీట్లు, 25 ఎస్టీ, 29 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. 2024 అక్టోబర్ 15 నాటికి, మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1.85 కోట్ల మంది 20-29 ఏళ్ల లోపు ఉన్నారు. ఈ ఎన్నికలలో 20.93 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి'' అని కమిషనర్ తెలిపారు.
జార్ఖండ్ లో 81 నియోజకవర్గాలు
జార్ఖండ్ రాష్ట్రంలో 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో 44 సీట్లు, ఎస్టీ కేటగిరీలో 28 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 9 సీట్లు ఉన్నాయి.మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు, 1.31 కోట్ల మంది పురుషులు, 66.84 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. అందులో 11.84 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.