
Mamata Banerjee: జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా.. ఉపాధ్యాయులకు మమతా బెనర్జీ మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు ఆ నియమిత ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. తాను బ్రతికినంతకాలం ఎవ్వరూ ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి రాదని హామీ ఇచ్చారు.
ఈ పరిణామం తనను తీవ్ర విషాదంలోకి నెట్టిందని,తన హృదయం రాయిలా గట్టిగా మారిపోయిందని పేర్కొన్నారు.
తాను మాట్లాడిన తీరు పట్ల తనను జైలులో వేసే అవకాశం ఉందని.. ఎవరు తనను సవాల్ చేస్తే, ఆ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు.
ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని,అర్హులైన అభ్యర్థులు తమ ఉద్యోగాలను కోల్పోకుండా చర్యలు తీసుకుంటానని ఆమె నొక్కి చెప్పారు.
వివరాలు
కొత్త నియామక ప్రక్రియ
ఇటీవలి కాలంలో బెంగాల్ ప్రభుత్వం మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని నియమించింది.
అయితే, ఈ నియామకాలను సుప్రీంకోర్టు గత గురువారం రద్దు చేసింది. ఈ నియామక ప్రక్రియలో నిబంధనలకు వ్యతిరేకంగా, నిస్సారంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
2024 ఏప్రిల్ 22న కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించింది.
నియామకాలను రద్దు చేసిన అనంతరం, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడునెలల వ్యవధిలో కొత్త నియామక ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.