మేనకా గాంధీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్
మతపరమైన సంస్థ ఆవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) రూ.100 కోట్ల పరువునష్టం నోటీసును పంపింది. ఇస్కాన్ ఆమె ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో భక్తులు ఎంతో భాదపడ్డారని ఇస్కాన్ సంస్థ తెలిపింది. ఇస్కాన్‌పై పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మేనకా గాంధీకి ఈరోజు రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసు పంపినట్లు సంస్థ తెలిపింది. ఇస్కాన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని చేసేవారు ఎలాంటి వారైనా వారిని వదిలిబెట్టబోమని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ అన్నారు.
అసలు మేనకా గాంధీ ఏమన్నారంటే..
గోశాలలోని ఆవులను ఇస్కాన్ కసాయిలకు విక్రయిస్తుందని అంటున్నమేనకా గాంధీ వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యింది. ఇస్కాన్ గోశాలలను నెలకొల్పుతుందని, ఆవుల నిర్వహణ కోసం భూముల రూపంలో ప్రభుత్వం నుంచి అపరిమిత ప్రయోజనాలను పొందుతుందని మేనక ఆరోపించారు. అంతేకాకుండా మేనకా ఇటీవల ఇస్కాన్‌కు చెందిన అనంతపురంలోని గోశాల (ఆంధ్రప్రదేశ్‌లో) సందర్శించిగా అక్కడ ఒక్క ఆవు కూడా మంచి స్థితిలో కనిపించలేదన్నారు. గోశాలలో దూడలు లేవని, వాటిని అమ్మేసినట్టు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఇస్కాన్ గట్టిగా ఖండించింది. ఈ ఆరోపణలను నిరాధారమైనవని పేర్కొంది.