AIIMS: ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ (AIIMS) తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు స్వాగతం పలికారు. ఎయిమ్స్ కార్యక్రమానికి చేరుకున్న ముర్ము, మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసిన 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
దేశ సమగ్ర ఆరోగ్య సంరక్షణలో యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి: ముర్ము
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, వైద్య వృత్తి ద్వారా విద్యార్థులు మానవత్వానికి ప్రాధాన్యమిచ్చే సేవా మార్గాన్ని ఎంచుకున్నారని ప్రశంసించారు. ప్రజల ప్రాణాలను కాపాడే, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ వృత్తి ఎంతో విలువైనదని ఆమె అన్నారు. యువ వైద్యులు ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో సేవలందించాలని సూచించారు. దేశ సమగ్ర ఆరోగ్య సంరక్షణలో యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలని ఆమె అభిప్రాయపడ్డారు. చిత్తశుద్ధితో పని చేస్తూ, దేశ ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎయిమ్స్ కోసం అదనంగా 10 ఎకరాల స్థలం
మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్ దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సంస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఎయిమ్స్ కోసం అదనంగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.