Page Loader
TPCC: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌
తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌

TPCC: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలిగా ఉన్న మీనాక్షి నటరాజన్, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

వివరాలు 

కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ ప్రయాణం 

మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్, కింది స్థాయి నుంచే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్ వింగ్, అలాగే ఏఐసీసీ (AICC)లో కూడా కీలక భాద్యతలు నిర్వర్తించారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఆ తర్వాతి రెండు ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ, రాహుల్ గాంధీ అత్యంత విశ్వసనీయ నేతల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు.

వివరాలు 

తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు 

గత కొంతకాలంగా తెలంగాణలో కొత్త ఇన్‌ఛార్జి నియామకం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీపాదాస్ మున్షీ కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా ఉన్నప్పటికీ, తెలంగాణపై తగిన శ్రద్ధ వహించడం లేదని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, సీనియర్ నేతలను కలవకుండా, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఆమె వ్యవహరించారని, దీంతో పార్టీకి నష్టం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కొత్త ఇన్‌ఛార్జి నియామకాన్ని కోరారు. ఈ నేపథ్యంలో, పార్టీ హైకమాండ్ ఆమెను కేవలం కేరళ వ్యవహారాలకే పరిమితం చేసి, తెలంగాణ బాధ్యతలను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించింది.

వివరాలు 

ఇతర రాష్ట్రాల్లోనూ మార్పులు 

తెలంగాణతో పాటు, ఏఐసీసీ పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలకు కొత్త ఇన్‌ఛార్జులను ప్రకటించింది. అదేవిధంగా, పంజాబ్, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ శాఖలకు కొత్త జనరల్ సెక్రటరీలను నియమించింది. ఈ తాజా నియామకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.