
Mega DSC: మెగా డీఎస్సీ, ఉద్యోగాల నియామకంపై చంద్రబాబు కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీపై కసరత్తు చేస్తోందన్న విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కీలక ప్రకటన చేశారు.
ఏప్రిల్‌లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించి, జూన్‌లోపు ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతను పూర్తిగా తొలగిస్తామని వెల్లడించారు.
బాపట్లలో సీఎం చంద్రబాబు ప్రసంగం
బాపట్ల జిల్లాలోని కొత్త గొల్లపాలెంలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే నెలలో "తల్లికి వందనం" పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించి, దాని కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
వివరాలు
పెన్షన్ పెంపు, సంక్షేమ పథకాలు
ఇప్పటికే పెంచిన పింఛన్లను అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రతి నెలా రూ.6,000 చొప్పున పింఛన్లు అందజేస్తున్నామని వివరించారు.
ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది పెన్షన్ల కోసం రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇందులో ప్రతి నెల రూ.2,722 కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు.
అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, దీని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలమని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, రాష్ట్రంలోని నదులను అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు.
వివరాలు
విశాఖ ఉక్కు, రహదారుల అభివృద్ధి
విశాఖ ఉక్కును గత ప్రభుత్వం దివాలా తీయించిందని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
అయితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి గాడిలో పడిందని చెప్పారు. ఇది నిజమైన పాలన ఎలా ఉండాలో చూపిస్తున్నదని వ్యాఖ్యానించారు.
ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలోని రహదారులన్నీ పూర్తిచేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.