
Tahawwur Rana: తహవ్వుర్ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
2008 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణా ను భారతదేశానికి తరలిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసును వాదించేందుకు నరేందర్ మాన్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అతను మూడు సంవత్సరాల పాటు లేదా ట్రయల్ ముగిసేంతవరకూ.. ఏది ముందుగా జరిగితే అది.. దిల్లీలోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక న్యాయస్థానాల్లో, అప్పీల్ కోర్టుల్లో ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించనున్నాడు.
వివరాలు
తిహాడ్ జైలుకు తహవ్వుర్ రాణా
తహవ్వుర్ రాణా పాకిస్థాన్ కు చెందినవాడు, కాని కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడు.
అతను 26/11 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని అనుమానంతో 2009లో అరెస్ట్ అయ్యాడు.
అప్పటి నుంచి అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న రాణాను ప్రస్తుతం భారత్‌కు అప్పగింత ప్రక్రియలో భాగంగా తీసుకువస్తున్నారు.
బుధవారం రాత్రి 7:10 గంటలకు అతన్ని తీసుకొచ్చే ప్రత్యేక విమానం ఇండియాకు బయలుదేరింది.
గురువారం మధ్యాహ్నానికి ఆ విమానం భారత్‌కు చేరుకోనుంది. దేశానికి వచ్చిన వెంటనే ఎన్‌ఐఏ అధికారులు అతన్ని అధికారికంగా అరెస్ట్ చేసి, దిల్లీలోని తిహాడ్ జైలుకు తరలించనున్నారు.
జైలు నంబర్ 2లో అతనిని ఉంచే అవకాశం ఉంది.
వివరాలు
అజ్మల్ కసబ్‌కు జైల్లో బిర్యానీ
ఇక 26/11 ఘటనపై స్పందించిన ముంబయిలో చాయ్ వాలాగా పని చేసే మహ్మద్ తౌఫిక్ మాట్లాడుతూ.. రాణాకు జైల్లో ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు, ముఖ్యంగా బిర్యానీ వంటివి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.
అప్పట్లో అదే దాడిలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు జైల్లో బిర్యానీ ఇచ్చారని వార్తలు వచ్చాయని గుర్తు చేశారు.
కసబ్‌కు భారత ప్రభుత్వం 2012 నవంబర్ 21న ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
ముంబయిలో దాడులు
2008 నవంబర్ 26న సముద్ర మార్గం ద్వారా 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ముంబయిలోకి ప్రవేశించి, సీఎస్‌ఎంటీ స్టేషన్, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ వంటి ప్రదేశాల్లో దాడులకు పాల్పడ్డారు.
ఈ మారణకాండ నవంబర్ 29 వరకు కొనసాగింది. మొత్తం 166 మంది మృతి చెందగా, వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఉగ్రదాడిలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్ వంటి అత్యుత్తమ అధికారి అమరులయ్యారు.