Microchip Technology: హైదరాబాద్‌లో మైక్రోచిప్‌ల తయారీకి ప్రయోగాలు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మక పరిశోధన
మనమందరం వాడుతున్న పరికరాలు,సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్లు, టీవీలు, రిమోట్‌లు, కార్యాలయాల్లో వాడే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మనం ప్రయాణించే కార్లు, విమానాలు, అంతరిక్షంలోకి పంపే రాకెట్లు, వాతావరణ సమాచారాన్ని అందించే ఉపగ్రహాలు,అన్నింటిలోనూ చిప్‌లు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ చిప్‌ల దిగుమతికి మన దేశం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ సమస్యకు సొల్యూషన్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగానికి చిరునామాగా మారిన హైదరాబాద్ ఇప్పుడు చిప్‌ల తయారీలో కూడా కీలకంగా మారే దిశగా అడుగులు వేస్తోంది.
ఒక్క సాంకేతిక ఆలోచన రూ.5 కోట్లు తెచ్చింది
తైవాన్‌కు ధీటుగా స్వదేశీ వనరులతో ఫ్రీక్వెన్సీ సింథసైజర్‌ను తయారుచేయాలన్న లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పరిశోధన మొదలైంది. ఇరుపది మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ చిప్ గిగాహెర్ట్జ్ సామర్థ్యంతో పని చేస్తుందని నివేదిక సమర్పించారు. కేంద్రం దీనిని అంగీకరించి రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలతో పాటు మరో ఇంజినీరింగ్ సంస్థ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి. 2023 జనవరిలో మొదలైన ఈ పరిశోధన 2023 ఆగస్టులో 90% పూర్తయింది. మరో రెండు నెలల్లో చిప్ తయారీ పూర్తవుతుందని అంచనా.
తైవాన్‌కు పోటీగా..
మైక్రోచిప్‌ల తయారీలో భారత్ కూడా ప్రధాన కేంద్రంగా ఎదగాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రణాళిక రూపొందిస్తోంది. మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చిప్‌ల వినియోగం అనివార్యమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశం రూ.1,29,703 కోట్ల విలువైన చిప్‌లను దిగుమతి చేసుకున్నదంటే వీటి ప్రాధాన్యం ఎంత ఉందో తెలుస్తోంది. చిప్‌ల తయారీలో ప్రపంచంలో తైవాన్ ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం సహా మరికొన్ని దేశాలు 3-5 మిల్లీమీటర్ల పరిమాణంలో చిప్‌లను తయారు చేస్తున్నప్పటికీ, తైవాన్‌లో ఒక మిల్లీమీటర్ పరిమాణంలోనే చిప్‌లను ఉత్పత్తి చేస్తోంది. అందుకే అన్ని దేశాలు తైవాన్‌పై ఆధారపడుతున్నాయి. కరోనా సమయంలో ఈ చిప్‌ల ఎగుమతి నిలిచిపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలింది.
"చిప్-టు-స్టార్టప్" పథకం
దీన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్రం "చిప్-టు-స్టార్టప్" పథకాన్ని ప్రారంభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పథకంలో భాగస్వామ్యం వహించింది. ఫ్రీక్వెన్సీ సింథసైజర్ చిప్‌లు తయారీకి ఉస్మానియా పరిశోధన బృందం ముందుకు వచ్చింది. ఇదో విప్లవాత్మక ముందడుగు ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశం చిప్‌ల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గిపోతుంది. వచ్చే 3-5 సంవత్సరాల్లో చిప్‌ల దిగుమతి 20% తగ్గే అవకాశం ఉంది. ఇది భారత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక విప్లవాత్మక ముందడుగు అవుతుంది.