Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై మంత్రి నిమ్మల క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)మంగళవారం శాసనమండలి సమావేశంలో సమాధానం ఇచ్చారు.
వైసీపీ ఎమ్మెల్సీ,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరగా, మంత్రి నిమ్మల స్పందిస్తూ, 2019 ఫిబ్రవరి 18న రూ. 55 వేల కోట్లతో టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో చంద్రబాబు నాయుడు ద్వారానే పోలవరం వ్యయం ఆమోదించబడిందని తెలిపారు.
2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1,ఫేజ్-2 అనే విభజన లేకపోవడంతో పాటు, 41.15 మీటర్లు లేదా 45.72 మీటర్ల ఎత్తు గురించి ఎక్కడా ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. అలాంటిదేదైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.
వివరాలు
ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు వైసీపీ తీవ్ర అన్యాయం
ఎత్తుకు సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 విభజనను 2019తర్వాత వైసీపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని మంత్రి రామానాయుడు తెలిపారు.
2020లో జగన్ ప్రభుత్వం పోలవరం కుడి కాలువ(Right Canal)నీటి సామర్థ్యాన్ని 17,560 క్యూసెక్కుల నుంచి 11,650 క్యూసెక్కులకు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 8,122 క్యూసెక్కులకు తగ్గించి,ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
"నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం,అవినీతి పత్రిక ఉంది కదా అని అబద్ధపు వార్తలు రాయడం ఎంత మాత్రం సమంజసం కాదు"అంటూ వైసీపీ తీరును తప్పుబట్టారు.
గత సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై స్పష్టమైన సమాధానం ఇచ్చినప్పటికీ, మళ్లీ అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించడం వైసీపీ మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఆర్ అండ్ ఆర్ (R&R) ప్యాకేజీపై వివరాలు
2019 నాటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేసిందని, కానీ 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 2% మాత్రమే పూర్తి చేసిందని, ఇది గణాంకాల ద్వారానే స్పష్టమవుతుందని తెలిపారు.
పోలవరం నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి 90,000 కుటుంబాలు ఉండగా, 12,000 కుటుంబాలకు పునరావాసం కల్పించామని మంత్రి తెలిపారు.
గత తెలుగుదేశం హయాంలో 2017లో రూ. 830 కోట్ల పరిహారం ఇచ్చినప్పటికీ, ఇప్పుడే మరోసారి రూ. 990 కోట్లు విడుదల చేశామని వివరించారు.
నిర్వాసితుల పునరావాసానికి పైసా కూడా ఖర్చు పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే, అది వైసీపీ మాత్రమేనని విమర్శించారు.
వివరాలు
నదుల అనుసంధానం.. పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యత
"నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం" అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే నదుల అనుసంధానం సాఫల్యంగా మారుతుందని అన్నారు. "అందువల్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అనే అంశమే లేదు" అని స్పష్టంచేశారు.
వివరాలు
పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతి
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని, పుష్కర, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ద్వారా ఈ ఏడాదిలోనే ఉత్తరాంధ్రకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.
దీనికి రూ. 1,600 కోట్లు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించామని, 2025 జూన్ నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి, జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలను తరలించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.