
Nimmala Ramanaidu: పోలవరం,ఎడమ, ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులలో పోలవరం ఒకటి. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలవరం ప్రాజెక్టుతో పాటు,పోలవరం ఎడమ కాలువ,ప్రధాన కాలువల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జీ. సాయి ప్రసాద్,సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ చీఫ్ నరసింహమూర్తి, సంబంధిత ప్రాజెక్టుల ఎస్‌ఈలు, ఈఈలు, పనులు చేపట్టిన ఏజెన్సీల ప్రతినిధులు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వివరాలు
వరద కాలంలో కూడా పనులు నిలిచిపోకుండా డీ వాటరింగ్ ప్రక్రియతో పనులు
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, డయాఫ్రమ్ వాల్ మొత్తం 25,238 చదరపు మీటర్లలో ఇప్పటివరకు 40 శాతం పని పూర్తైందని తెలిపారు. మొత్తం 373 ప్యానెల్లల్లో, అత్యంత క్లిష్టంగా ఉన్న 130 ప్యానెల్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. వరద కాలంలో కూడా పనులు నిలిచిపోకుండా డీ వాటరింగ్ ప్రక్రియతో పనులు కొనసాగించి, 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గ్యాప్-1 లో ఎర్త్ కమ్ రాక్‌ఫీల్ డ్యామ్ పనులు 2026 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో సాగుతున్నాయని చెప్పారు. అలాగే గ్యాప్-2 లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌కు సంబంధించిన నమూనాలను సీడబ్ల్యూసీ మరియు పీపీఏ ఆమోదించగానే, నవంబర్ నెలలో పని ప్రారంభిస్తామని వెల్లడించారు.
వివరాలు
గోదావరి నీటిని ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించేలా చర్యలు
పోలవరం ఎడమ కాలువ పనులను 2025 లోగా పూర్తి చేసి, గోదావరి నీటిని ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అన్ని పనులు వేగంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వచ్చే ఆగస్టు లోపుగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక, గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో పోలవరం ఎడమ కాలువపై ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడమే కాకుండా, ఒక్క తట్ట మట్టినీ నిక్షిప్తం చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.