
MK Stalin-Yogi Adityanath: పొలిటికల్ బ్లాక్ కామెడీ: హిందీ వివాదంపై యోగి- స్టాలిన్ మాటల యుద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ విద్యా విధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
స్టాలిన్ మాట్లాడుతూ, "యోగి ఆదిత్యనాథ్ మాకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, "ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికే స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు," అని యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు.
వివరాలు
ఇది న్యాయ పోరాటం
దీనిపై స్టాలిన్ ఘాటుగా స్పందిస్తూ, "తమిళనాడు రాష్ట్రం తన ద్విభాషా విధానం, నియోజకవర్గాల పునర్విభజనపై న్యాయమైన, స్పష్టమైన స్వరాన్ని వినిపిస్తోంది. దీనిపై భాజపా కలవరం చెందుతోంది. విద్వేషంపై యోగి మాకు పాఠాలు చెప్పాలనుకోవడం అతి పెద్ద డార్క్ కామెడీ. మేము ఏ భాషను వ్యతిరేకించడం లేదు. కానీ బలవంతంగా రుద్దడాన్ని అంగీకరించం. ఇది న్యాయ పోరాటం," అని చెప్పుకొచ్చారు.
ఇక, స్టాలిన్ వ్యాఖ్యలపై భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ, "ప్రజల దృష్టిని మళ్లించేందుకు మీరు చేస్తున్న రాజకీయాలు అందరికీ అర్థమయ్యాయి. ఈ నిజాన్ని గ్రహించకపోవడం దురదృష్టకరం," అని విమర్శించారు.
వివరాలు
త్రిభాషా విధానం - జాతీయస్థాయిలో చర్చ
జాతీయ విద్యావిధానం (NEP-2020)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలనే నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకారం, విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు నేర్చుకోవాలి, అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని స్పష్టం చేసింది.
అయితే, కొన్ని రాష్ట్రాలు దీనిని "హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం తీసుకున్న చర్య," అంటూ విమర్శిస్తున్నాయి.
తమిళనాడు ఈ విషయంపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. "విద్యార్థుల చదువుకునే హక్కును హరించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి," అంటూ ఆయన మండిపడ్డారు.