
MLC Kavita: 'నా దారికి రావాల్సిందే'.. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాష్ట్ర సమితి నేతలు తమ దారిలోకి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయాన్ని సమర్థించడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో రెండు బిల్లులు తీసుకురావాలని మొదట డిమాండ్ చేసిన వ్యక్తి తానేనని గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించకపోవడాన్ని ప్రస్తావించిన కవిత, ఆ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేశానని చెప్పారు.
వివరాలు
బనకచర్ల ప్రాజెక్టుపై జాగృతి పోరాటం కొనసాగుతుంది..
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి,ఇద్దరు ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో పండగ వాతావరణం కనిపించిందని,కానీ మొదట బనకచర్ల అంశంపైనే చర్చ ప్రారంభమైనట్లు కవిత వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి జలాలను అప్పగించి వచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని, సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన విధానం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని కోరారు. టెలీమెట్రీల ఏర్పాటు విషయంలో కూడా స్పష్టత లేకపోయినా,సీఎం దీనిని విజయంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
వివరాలు
బనకచర్ల ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలి: కవిత
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కూడా లాభం ఏమీ ఉండదని, కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తోన్నారని ఆరోపించారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో జాగృతి న్యాయపరమైన పోరాటాన్ని ప్రారంభిస్తుందని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, బనకచర్ల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.