Page Loader
Weather Update: మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. సీఎం అధికారులకు కీలక ఆదేశాలు

Weather Update: మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇకపై అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో భారీ వర్షాలు కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులు విరుచుకుపడటంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నది సీఎం ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నగర పరిస్థితిపై నిరంతరం సమీక్ష జరిపేందుకు ఆదేశిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

Details

ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

రోడ్లపై నీరు నిలిచిన చోట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా విభాగాల సమన్వయంతో స్పందించాలన్నారు. విద్యుత్ అంతరాయాన్ని తొలగించి వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. జలమయమైన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు. వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా పలు జిల్లాల్లో పరిస్థితి విషమంగా మారిన నేపథ్యంలో అక్కడి జిల్లా కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Details

వాతావరణ శాఖ హెచ్చరిక

ఇక వర్షపాతం దృష్ట్యా.. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 100 ప్రాంతాల్లో 90 వరకు హైదరాబాద్‌లోనే ఉండడం గమనార్హం. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌లో 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. అనంతరం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 9.6 సెం.మీ, డబీర్‌పురాలో 9.45, సరూర్‌నగర్‌లో 9.35, నాంపల్లిలో 9.43, ముషీరాబాద్‌లో 9.43 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. నేడు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Details

ఎల్లో అలెర్ట్ జారీ

మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, దిలాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.