Chandrababu: దిల్లీలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం మోదీనే : చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
దిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు.
1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయని, ఆ సంస్కరణలను తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.
1995 నుంచి 2024 మధ్య దేశంలోని తలసరి ఆదాయం తొమ్మిది రెట్లు పెరిగిందని తెలిపారు. సంపద సృష్టించగలిగితేనే ఆదాయం పెరుగుతుందని, మౌలిక వసతులు మెరుగవుతాయని అన్నారు.
Details
తెలుగు రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరిగింది
తెలుగు రాష్ట్రాల్లో తలసరి ఆదాయం 3,000 డాలర్లకు (సుమారు రూ.2.63 లక్షలు) పెరిగిందని, అయితే బిహార్‌లో అది ఇంకా 750 డాలర్లే (సుమారు రూ.65,000) ఉందని చంద్రబాబు వివరించారు.
టెక్నాలజీ సాయంతో అభివృద్ధి సాధించామని, ఐటీ, మౌలిక వసతులు గేమ్ ఛేంజర్‌గా మారాయని అన్నారు.
సమయానికి సరైన నాయకత్వం దక్కడం చాలా ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
మంచి పాలన అందిస్తే అది శ్రేయస్సుకి దారితీస్తుందని తెలిపారు.
గుజరాత్ తలసరి ఆదాయం అనేక రాష్ట్రాలను దాటుకుని పెరిగిందని, దీని వెనుక స్థిరమైన పాలన, అభివృద్ధి ప్రధాన కారణమని పేర్కొన్నారు.