
PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ సంవత్సరం చివరలో బీహార్‌లో, వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు కీలక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు బీహార్, పశ్చిమ బెంగాల్‌ల పర్యటనకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.5,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ పట్టణంలో బీజేపీ నిర్వహించే భారీ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.
వివరాలు
బెంగాల్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి
వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో బెంగాల్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. మోడీ పర్యటన కూడా అందులో భాగమే. పశ్చిమ బెంగాల్ పర్యటన పూర్తి చేసిన అనంతరం మోడీ బీహార్‌లో పర్యటించనున్నారు. అక్కడ రూ.7,000 కోట్ల వ్యయంతో చేపట్టిన అనేక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరీ పట్టణంలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. రూ.4,079 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన 256 కిలోమీటర్ల దర్భాంగా-నార్కాటియాగంజ్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టును దేశానికి అంకితం చేయనున్నట్టు సమాచారం.
వివరాలు
బీహార్‌లో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు
బీహార్‌లో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. ఓటర్ల జాబితా విడుదలైన రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్‌లో ఇండియా కూటమి,ఎన్డీఏ కూటమి మధ్య ఘాటు పోటీ నెలకొంది. ఈ సారి ప్రజలు ఏ కూటమికి అధికారం అప్పగిస్తారో చూడాల్సిందే.