కేసీఆర్ తీరుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ గెలిస్తే అతనే సీఎం అంట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎవరు ఔనన్నా, కాదన్నా రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ బలపడిందని కితాబిచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని,అలాంటప్పుడు ఒక్కసారైనా కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హాయాంలోనే మాదిగలకు న్యాయం జరిగిందన్న మోత్కుపల్లి, కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క పథకం సక్రమంగా అమలు కావట్లేదన్నారు. 100 శాతం రుణ మాఫీ చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు.కేసీఆర్‌కు పదేళ్లు అవకాశమిస్తే, దొంగలను ఊర్ల మీదకు పంపారన్నారు. ఇప్పటికే ఒక్కో బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపుగా రూ.30 కోట్లు ఖర్చు చేశారని మోత్కుపల్లి ఆరోపించారు.
బేగంపేట ఇంట్లో మోత్కుపల్లి దీక్ష
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బేగంపేటలోని తన నివాసంలో మోత్కుపల్లి నరసింహులు దీక్ష చేశారు. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టారన్న ఆయన, జగన్ జైలులో ఉండి వచ్చినందుకు అందరూ జైళ్లకే పోవాలా అంటూ నిలదీశారు. చంద్రబాబు అరెస్ట్‌తో తెలుగు జనం ఆందోళన చెందుతున్నారన్నారు. అంతా కలిసి బాబును మానసికంగా వేధిస్తున్నారని, ఆయనకేమన్నా జరిగితే జగన్, కేసీఆర్, బీజేపీలే బాధ్యత వహించాలన్నారు. ఇదే సమయంలో జగన్ పాలనపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో జగన్ వల్ల ఎవరూ సంతోషంగా లేరన్నారు.
కేసీఆర్ కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది బాబే : మోత్కుపల్లి
అసలు రాజధాని లేని రాష్ట్రాన్ని జగన్ పాలిస్తున్నారని మోత్కుపల్లి చురకలు అంటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ఆటలను సాగనివ్వరని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ తనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని, ఆ తర్వాత అవమానించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం చంద్రబాబే ఇచ్చారని, అలాంటి బాబు ఇవాళ కష్టాల్లో ఉంటే ఆయనను పరామర్శించకపోవడం దారుణమన్నారు. భవిష్యత్ లో కేసీఆర్‌కు కూడా ఇదే దుస్థితి వస్తుందుని, అప్పుడు ఆ బాధ అర్థం అవుతుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఒక్కసారైనా ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు.